ఇలాంటివి కేసీఆర్ కు మాత్రమే సాధ్యం

Update: 2016-12-15 06:33 GMT
అధినేతల తీరు భిన్నంగా ఉంటుంది. అత్యుత్తమ స్థానాల్లో చేరుకున్న తర్వాత కూడా తమ మూలాల్ని మర్చిపోని నేతలు కొందరుంటే.. మరికొందరు మాత్రం అసలా విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోని వైనం కనిపిస్తుంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మొదటి కోవకు చెందిన సీఎంగా చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఎంతటి దర్పాన్నిప్రదర్శిస్తారో.. అప్పుడప్పుడు ఆయనలోని ఎమ్మెల్యే ఒక్కసారిగా నిద్ర లేస్తారు.

మహరాజు మాదిరిగా వ్యవహరిస్తూనే.. తన మూలాల్నిమర్చిపోని చిత్రమైన మనస్తత్వం కేసీఆర్ సొంతమని చెప్పాలి. ఈ విలక్షణతే ఆయన్ను.. మిగిలిన వారి కంటే భిన్నంగా నిలపుతుందనటంలో సందేహం లేదు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా కలెక్టర్లు.. ఎస్పీలు.. ముఖ్య అధికారులతో కలిసి భారీ ఎత్తున సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి.. ఈ సందర్భంగా కలెక్టర్లకు మార్గదర్శనం చేశారు.

సీరియస్ గా సాగుతున్న సమావేశంలో.. సిద్దిపేటలో నగదు రహిత లావాదేవీల్ని ఆ జిల్లా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి వివరిస్తున్నారు. నగదు రహితంగా మార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామన్న విషయాన్ని వివరిస్తున్న వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ హటాత్తుగా లేచి నిలుచున్నారు. కలెక్టర్ గారూ.. మాది గజ్వేల్.. నేను గజ్వేల్ ఎమ్మెల్యేని కూడా. నగదు రహితంపై మీరు కాస్త మా నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోవాలంటూ వ్యాఖ్యానించేసరికి.. అప్పటివరకూ సీరియస్ గా సాగుతున్న సమావేశంలో నవ్వులు పువ్వులై పూసాయి.

ఇలాంటి చర్యలు కేసీఆర్ కు మాత్రమే సొంతమని చెప్పాలి. ఈ ఉదంతాన్న నిశితంగా చూస్తే.. కేసీఆర్ లో మూడు కోణాలు కనిపిస్తాయి. నగదు రహిత లావాదేవీల్ని ప్రయోగాత్మకంగా చేపట్టిన నియోజకవర్గానికి తాను ప్రాతినిధ్యం వహించకున్నా.. తన నిర్ణయం మీదనే అది జరుగుతుందన్న విషయాన్ని చెప్పటమే కాదు.. తన నియోజకవర్గంలో కూడా ఈ విధానాన్ని త్వరగా అమలు చేయాలన్న విషయాన్ని కేసీఆర్ చెప్పకనే చెప్పినట్లుగా చెప్పాలి. అంతేకాదు.. సీరియస్ గా సాగిపోయే సమావేశంలో తనదైన చతురతతో.. అందరి దృష్టిని తనవైపు మళ్లించేలా చేయటంతో పాటు.. అధికారుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తారని చెప్పాలి. అన్నింటికంటే ముఖ్యమైంది.. ముఖ్యమంత్రి ఏక్షణంలో అయినా.. ఏ విషయంలో అయినా రియాక్ట్ అవుతారన్నవిషయాన్ని తన చేతలతో స్పష్టం చేశారని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News