బతుక‌మ్మ సంద‌ర్భంగా కేసీఆర్ కొత్త రికార్డ్‌

Update: 2017-08-25 15:54 GMT
టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆలోచ‌న ఏదైనా భారీగా ఉంటుంద‌నే విష‌యంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు. ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం స‌మ‌యంలో ఆయ‌న నిర్వ‌హించిన పోరాటాల సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు క‌దిలించ‌డం కావ‌చ్చు...ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కిన త‌ర్వాత తీసుకుంటున్న నిర్ణ‌యాలు కావ‌చ్చు భారీ నిర్ణ‌యాలకు పెట్టింది పేరు. అలాంటి పెద్ద క‌ల‌ల‌కు, కార్య‌క్ర‌మాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన కేసీఆర్ తాజాగా మ‌రో భారీ ఆలోచ‌న‌ను అమ‌ల్లో పెడుతున్నారు.

తెలంగాణ ప్ర‌జల విశిష్ట‌త‌ను చాటే పూల పండుగ అయిన బ‌తుక‌మ్మను గతంలోనే గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర పండుగ అంటే ఆ సంబురం అట్ట‌హాసం ఓ రేంజ్‌ లో ఉండాలి క‌దా? అలాంటి రేంజ్‌కు త‌గ్గ‌ట్లే....ఒకే రోజు కోటి నాలుగు ల‌క్ష‌ల చీర‌లు పంపిణీ చేసేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. కోటి నాలుగు ల‌క్ష‌లు అంటే....రికార్డ్ స్థాయిలో అని చెప్పుకోవ‌చ్చు. తెల్ల రేష‌న్ కార్డులు ఉన్న మ‌హిళ‌ల‌కు బ‌తుక‌మ్మ పండుగ రోజున ఉచితంగా చీర‌ల‌ను ప్ర‌భుత్వం పంపిణీ చేయ‌నుంది. కొద్దికాలం క్రితం ఈ భారీ కార్య‌క్ర‌మానికి ఓకే చెప్పేసిన కేసీఆర్ బ‌తుక‌మ్మ పండుగ ద‌గ్గ‌రికి వ‌స్తున్న నేప‌థ్యంలో తాజాగా స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో అధికారుల‌తో స‌మావేశ‌మైన కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 18 - 19 - 20 న బ‌తుకమ్మ చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా బ‌తుక‌మ్మ పండుగ‌ను పుర‌స్క‌రించుకొని చీర‌లు పంపిణీ చేయ‌డం గురించి అధికారుల‌తో సీఎం చ‌ర్చించారు.

బ‌తుక‌మ్మ పండుగ‌ను పుర‌స్క‌రించుకొని రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన పేద మ‌హిళ‌లంద‌రికీ కానుక‌గా చీర‌లు పంపిణీ చేయ‌నున్న‌ట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని 1కోటి 04లక్షల 57వేల 610 మందికి రేష‌న్ షాపుల ద్వారా సెప్టెంబ‌ర్ 18 - 19 - 20 న చీర‌ల‌ను పంపిణీ చేస్తార‌ని ఆయ‌న అన్నారు. కుల‌, మ‌తాల‌కు అతీతంగా పేద మ‌హిళ‌లంద‌రికీ చీర‌ల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు సీఎం కేసీఆర్‌ వివ‌రించారు. ప‌వ‌ర్ లూమ్ - హ్యాండ్లూమ్ కార్మికుల‌కు ఉపాధి క‌ల్పించ‌డం కోసం వారు నేసిన చీర‌ల‌నే కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధం చేస్తున్న‌ట్లు సీఎం తెలిపారు. మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎంపీలు - ఎమ్మెల్సీలు - ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులు పేద మ‌హిళ‌లంద‌రికీ చీర‌లందించే కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని సీఎం ఆకాంక్షించారు. చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని స్వ‌యంగా క‌లెక్ట‌ర్లు ప‌ర్య‌వేక్షించాల‌ని కేసీఆర్ ఆదేశించారు.
Tags:    

Similar News