మార్పులు మంచి చేస్తాయంటోన్న కేసీఆర్‌!

Update: 2021-12-17 08:32 GMT
గ‌త కొంత‌కాలంగా వివిధ ఎన్నిక‌ల రూపంలో తెలంగాణ‌లో కొన‌సాగిన రాజకీయ వేడి ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాలతో ముగిసింది. ఇక ఇప్పుడప్పుడే రాష్ట్రంలో ఎన్నిక‌లు లేవు. శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల గ‌డువు ఉంది.

ఈ స‌మ‌యాన్ని పూర్తిగా ఉప‌యోగించుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేస్టున్న‌ట్లుగా స‌మాచారం. గ‌తంతో పోలిస్తే ప్ర‌స్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ఆశించిన స్థాయిలో రాజకీయ ప‌వ‌నాలు వీచ‌డం లేదు. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన కేసీఆర్ దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు పూనుకుంటార‌ని తెలిసింది.

త్రిముఖ పోరు..

ప్ర‌స్తుతం రాష్ట్ర రాజ‌కీయాల్లో త్రిముఖ పోరు న‌డుస్తుంద‌ని చెప్పాలి. గ‌తంలో టీఆర్ఎస్ తిరుగులుని ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించేది. కేసీఆర్‌కు దీటుగా నిల‌బ‌డ‌గిలిగే ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కూడా ఎవ‌రూ క‌నిపించ‌లేదు.

కానీ గ‌తేడాదిగా ప‌రిస్థితుల్లో అనూహ్య‌మైన మార్పు వ‌చ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ ఎంపికైన త‌ర్వాత రాష్ట్రంలో ఆ పార్టీకి కొత్త వేగం వ‌చ్చింది.

దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌తో పాటు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు షాకిచ్చిన బీజేపీ రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తిగా ఎదుగుతోంది. మ‌రోవైపు టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ నియామ‌కంతో కాంగ్రెస్‌లోనూ క‌ద‌లికి వ‌చ్చింది. ఆ పార్టీ కూడా జోరు మీదుంది.

ఎన్నిక‌లే ల‌క్ష్యంగా..

ప్ర‌స్తుతం రాష్ట్రంలో రెండు పార్టీల నుంచి పోటీ నేప‌థ్యంలో కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌లపై ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. ఆ ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వంలో పార్టీలో మార్పులు చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ముందుగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారుల బ‌దిలీల‌ను పెద్ద ఎత్తున చేప‌ట్ట‌డంపై ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. మ‌రోవైపు మంత్రివ‌ర్గంలోనూ కేసీఆర్ మార్పులు చేస్తార‌ని తెలిసింది.

ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని అదే సామాజిక వ‌ర్గానికి చెందిన బండా ప్ర‌కాశ్‌తో భ‌ర్తీ చేయ‌నున్నారు. మ‌రోవైపు కీల‌క‌మైన ఆర్థిక శాఖ‌ను హ‌రీశ్ రావు నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డికి అప్ప‌గిస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది.

అందుకే ఆయ‌న హ‌రీశ్‌కు ఇప్ప‌టికే వైద్య ఆరోగ్య శాఖ‌ను కేటాయించార‌ని అంటున్నారు. మ‌రోవైపు బీజేపీని ఎదుర్కునేందుకు పార్టీలోనూ మార్పులు చేయ‌నున్న‌ట్లు వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. క‌ష్ట‌ప‌డే ప‌నిచేసే వారికే పార్టీలో ప్రాధాన్య‌త క‌ల్పించే దిశ‌గా కేసీఆర్ సాగుతార‌ని టాక్‌.

Tags:    

Similar News