కేసీఆర్ సంచలనం: అందరి కోరిక అదే అయితే దేశం కోసం కొత్త పార్టీ పెడతా

Update: 2022-02-14 03:31 GMT
ఆదివారం సాయంత్రం ముఖ్యమైన ప్రెస్ మీట్ ఉందంటూ తెలంగాణ సీఎంవో నుంచి పాత్రికేయులకు సమాచారం అందటం.. గడిచిన కొద్ది రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్.. మరింత ఘాటుగా మాట్లాడతారని అందరూ అంచనా వేశారు.

అందుకు తగ్గట్లే.. ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయటమే కాదు.. సంచలన ప్రకటన చేశారు. దేశం కోసం అవసరమైతే కొత్త పార్టీ పెడతానని.. అందరి కోరిక అదే అయితే తాను వెనక్కి తగ్గనంటూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమేనని స్పష్టం చేసిన ఆయన.. దేశం కోసం ముందుకు కదలాల్సింది దేశ ప్రజలేనని వ్యాఖ్యానించారు. జనం ప్రభంజనమైతే.. ఎవరూ అడ్డుకోలేరన్నారు. ప్రజలు కలిసి వస్తే.. నాయకులు కదిలి వచ్చే పరిస్థితి వస్తుందన్న ఆయన.. టీఆర్ఎస్ పార్టీని పెట్టినప్పటి పరిస్థితి గురించి గుర్తు చేసుకున్నారు.

దేశంలోని అన్ని రాజకీయ శక్తులు ఏకమై బీజేపీని వెళ్లగొట్టాలన్నారు. భవిష్యత్తు రాజకీయాలను ఊహించి చెప్పలేమని.. బీజేపీ ఆరాచక పాలన గురించి దేశమంతా చర్చ జరగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేవారు.

‘‘ప్రజలు కదిలి వస్తే నాయకులు కదిలి వచ్చే పరిస్థితి వస్తుంది. అందరి కోరిక అదే అయితే.. దేశం కోసం కొత్త పార్టీ అవసరమైతే పెడదా. కొత్త పార్టీ పెడితే తప్పేమీ లేదు. మన దేశ ప్రజాస్వామ్యంలో ఆ స్వేచ్ఛ ఉంది. ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. ఏదైనా సాధించొచ్చు. టీఆర్ఎస్ ను స్థాపించినప్పుడు ఎన్నో మాటలు అన్నారు. ఆత్మవిశ్వాసంతో పోరాడి.. జనాల్లో చైతన్యాన్ని తెచ్చాం. కఠోర సమైక్యవాదినన్న  చంద్రబాబు జైతెలంగాణ అనలేదా? సమైక్యవాద పార్టీ సీపీఐ జై తెలంగాణ అనలేదా? అంటూ ప్రశ్నించారు.

కొత్త పార్టీ పెట్టే దమ్ము తనకు ఉందన్న కేసీఆర్.. ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకుంటే ఏమైనా జరగొచ్చన్నారు. తాను పుట్టగానే సీఎంను అవుతానని తన తల్లిదండ్రులు కలగన్నారా? అని ప్రశ్నించిన కేసీఆర్.. ఒక పద్దతి ప్రకారం పని చేస్తుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని వ్యాఖ్యానించారు. మొత్తంగా.. మోడీ మీద చేస్తున్న యుద్ధం పీక్స్ కు చేరినట్లుగా కేసీఆర్ తాజా వ్యాఖ్య స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News