థూ.. మీ బతుకులు చెడ.. కేసీఆర్ తిట్టు చెప్పేదిదే!

Update: 2018-10-04 04:50 GMT
అనుకున్న‌ట్లే జ‌రిగింది. అంచ‌నా ఎంత మాత్రం త‌ప్పు కాలేదు. ప్ర‌స్తుతం కేసీఆర్ ఎలాంటి మూడ్ లో ఉన్నారు. ముంద‌స్తుకు తానే స్వ‌యంగా ముహుర్తం పెట్టిన కేసీఆర్ కు.. ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలు ఏ మాత్రం మింగుడుప‌డ‌టం లేద‌న్న విష‌యం తేలిపోయింది.

నిజామాబాద్ లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ సంద‌ర్భంగా త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో దునుమాడ‌టం కనిపిస్తుంది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా చంద్ర‌బాబుతో పొత్తు పెట్టుకోవ‌టం కోసం కాంగ్రెస్ ఆరాటాన్ని తీవ్ర‌స్థాయిలో మండిప‌డిన కేసీఆర్‌.. ఏకంగా తీవ్ర ప‌ద‌జాలాన్ని వాడేందుకు సైతం వెనుకాడ‌లేదు.

థూ.. మీ బతుకులు చెడ.. అంటూ త‌న‌లోని ఆగ్ర‌హాన్ని కేసీఆర్ బ‌య‌ట‌పెట్టేశారు. మ‌హాకూట‌మిగా  విప‌క్షాలు ఒక జ‌ట్టు కావ‌టాన్ని కేసీఆర్ ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్న వైనాన్ని కేసీఆర్ ఓపెన్ గానే చెప్పేశార‌ని చెప్పాలి. కూట‌మి నిర్ణ‌యం త‌న‌ను.. త‌న క‌ల‌ల్ని దెబ్బ తీస్తుంద‌న్న భ‌యం కేసీఆర్ మాట‌ల్లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోందన్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న ఒక అధినేత నోటి నుంచి ఏ మాత్రం ఊహించ‌ని రీతిలో వ‌చ్చిన మాట‌లు విన్న‌ప్పుడు.. రాజ‌కీయాల్లో మ‌ర్యాద‌ల‌కు ఏ మాత్రం స్థానం లేద‌న్న విష‌యాన్ని కేసీఆర్ స్ప‌ష్టం చేసిన‌ట్లే. నిజామాబాద్ బ‌హిరంగ స‌భ‌లో కూట‌మి కోసం పొత్తు క‌డుతున్న విప‌క్ష నేత‌ల్ని ఉద్దేశించి కేసీఆర్ అన్న మాట‌ల్ని అన్న‌ట్లుగా ఒక‌సారి యాది చేసుకుంటే.. ‘‘సిగ్గు లేకుండా చంద్రబాబుతో పొత్తు కలుస్తరట. థూ.. మీ బతుకులు చెడ. మీవో బతుకులా? ఎవడైతే తెలంగాణను నాశనం చేసిండో - ఎవడైతే నిర్దాక్షిణ్యంగా వందల మంది తెలంగాణ బిడ్డలను ఎన్‌ కౌంటర్ల పేరిట బలి పెట్టుకున్నడో... తెలంగాణ ద్రోహి... చంద్రబాబుతో పొత్తా? అడుక్కుంటే నేనిస్తాను కదా నాలుగు సీట్లు!.’’అన్న మాట‌ల ద్వారా కేసీఆర్ త‌న‌లోని ఆగ్ర‌హాన్ని.. ఆక్రోశాన్ని మాత్ర‌మే కాదు.. అహంకారాన్ని కూడా ప్ర‌ద‌ర్శించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇంత తీవ్ర ప‌ద‌జాలాన్ని ఉప‌యోగించ‌టం వెనుక.. మ‌హాకూట‌మి కార‌ణంగా క‌లిసి వ‌చ్చే వాతావ‌ర‌ణాన్ని బ్రేక్ చేయ‌టంతో పాటు.. తెలంగాణ సెంటిమెంట్‌ ను రాజేసే భారీ ప్ర‌య‌త్నానికి కేసీఆర్ తెర తీశార‌ని చెప్పాలి. తాజా బ‌హిరంగ స‌భ మొద‌లు.. ఇక‌పై బాబుపైనా.. కాంగ్రెస్ పొత్తు మీదా తీవ్ర వ్యాఖ్య‌లు కేసీఆర్ నోటి నుంచి కామ‌న్ గా వ‌స్తుంటాయ‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. రానున్న రోజల్లో మ‌సాలా వ్యాఖ్య‌ల‌కు.. గౌర‌వం అన్న‌ది లేకుండా బ‌జారున ప‌డి తిట్టుకున్న‌ట్లుగా మాట‌ల యుద్ధానికి కేసీఆర్ స్వ‌యంగా తెర తీశార‌ని చెప్పక త‌ప్ప‌దు.
Tags:    

Similar News