తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఆసక్తికరంగా ఉంటుంది. రోజుల తరబడి ప్రజలకు.. ప్రభుత్వ అధికారులకు ఏ మాత్రం అందుబాటులో ఉండని ఆయన.. ఉన్నట్లుండి సమావేశాలు షురూ చేస్తారు. ఊపిరి ఆడనట్లుగా నాలుగైదు రోజులు హడావుడి చేసిన తర్వాత మళ్లీ తన పాత విధానంలోకి వెళ్లిపోతారు.
మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. గంటల తరబడి సాగిన మీటింగ్ అనంతరం పెద్ద ఎత్తున తీసుకున్న నిర్ణయాల్ని వరుసపెట్టి ప్రకటించారు. అందులో తమ పార్టీకి సంబంధించిన అంశాలపై ఆయన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ లాంటి పార్టీలు తమకు భూమి కేటాయిస్తే పార్టీ కార్యాలయాల్ని నిర్మించుకుంటామని చెప్పినా ఆ వినతిని పరిగణలోకి తీసుకోని కేసీఆర్.. తమ పార్టీకి సంబంధించి మాత్రం 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించటానికి వీలుగా భూములు కేటాయిస్తూ నిర్నయాన్ని తీసేసుకున్నారు.
పార్టీ కార్యాలయాల కోసం భూమిని కేటాయించిన కేసీఆర్.. ఈ నెల24న ఒకే సమయంలో అన్ని జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఏక కాలంలో జరిగే ఈ శంకుస్థాపన కార్యక్రమం గ్రాండ్ గా చేయాలని నిర్ణయించారు. ఒక జిల్లా మినహాయించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎకరం విస్తీర్ణంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తాజాగా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి రూ.19.20 కోట్లు విడుదల చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. శంకుస్థాపనకు మరో నాలుగు రోజులు సమయం ఉన్న వేళలోనే.. భవనాల్ని వేగంగా నిర్మించాలని.. దసరా నాటికి అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాల్ని ఒకేసారి ప్రారంభించుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. శంకుస్థాపనకు ముందే.. ప్రారంభోత్సవాలు ఎప్పుడు జరగాలో డిసైడ్ చేసిన కేసీఆర్ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. ఆయన చెప్పినట్లే.. పార్టీ కార్యాలయాల ఓపెనింగ్ ఉంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సారు తలుచుకున్న తర్వాత జరగకుండా ఉంటుందా ఏంటి?