ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలలో కేసీఆర్ పని మొదలుపెట్టేశాడుగా..

Update: 2023-01-06 13:30 GMT
కేసీఆర్ తన బీఆర్ఎస్ విస్తరణ కార్యక్రమాల వేగం పెంచుతున్నారు. ఇప్పటికే ఏపీలో పార్టీ అధ్యక్షుడిని ప్రకటించారు. త్వరలో బహిరంగ సభ నిర్వహణకూ రెడీ అవుతున్నారని చెప్తున్నారు. అయితే.. ఇదంతా బయటకు కనిపించే వ్యవహారం.. పైకి కనిపించకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ ఎత్తున పని మొదలుపెట్టారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ముఖ్యంగా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలలో ఇప్పటికే పని మొదలైపోయిందట.

ముఖ్యంగా ఏపీ విషయానికొచ్చేసరికి... గతంలో కేసీఆర్ ఏపీ, ఏపీ ప్రజల విషయంలో చేసిన నెగటివ్ కామెంట్లు వారి మెదళ్ల నుంచి పోయేలా... అసలు అది ఏమీ తెలియని సరికొత్త ఓటర్లకు ఏపీ పట్ల కేసీఆర్ పాజిటివ్ వైఖరి పరిచయం చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు.

దీనికోసం ఇప్పటికే సోషల్ మీడియాను విస్తృతంగా వాడడం ప్రారంభించారు. ప్రధానంగా ఏపీలో యువత ట్విటర్ కంటే ఫేస్‌బుక్‌లో ఉన్నారని గుర్తించి ఫేస్ బుక్‌లో బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలు పెద్దఎత్తున కేసీఆర్ పాజిటివ్ కంటెంట్‌ను ప్రచారంలోకి తెస్తున్నాయి. ఏపీ విషయంలో కేసీఆర్ గతంలో చేసిన పాజిటివ్ కామెంట్ల వీడియో బైట్లు ఫేస్ బుక్‌లో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి.

దీంతోపాటు జర్నలిస్టులు, పీఆర్ పనులు చేసేవారికి పెద్దమొత్తంలో ప్యాకేజీలు ఇచ్చే కార్యక్రమమూ మొదలైపోయినట్లు చెప్తున్నారు. ఇది కేవలం ఏపీకి మాత్రమే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా వర్తింపజేస్తున్నారు.

మహారాష్ట్ర, కర్ణాటక భాషలు తెలిసిన తెలంగాణ జర్నలిస్టులను గుర్తించి వారికి మంచి ప్యాకేజీలు ఇచ్చి ఆయా రాష్ట్రాలకు పంపించే ప్రయత్నం జరుగుతోంది. అక్కడ జర్నలిస్ట్ సర్కిళ్లలోకి వీరువెళ్లి కేసీఆర్ పట్ల పాజిటివ్ వార్తల ఫ్రీక్వెన్సీ పెంచడం వీరి బాధ్యత.

బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలతో పాటు నమస్తే తెలంగాణ పత్రికకు పనిచేసే ఇద్దరు కీలక వ్యక్తులు ఈ వ్యూహాలు, పనుల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నట్లు చెప్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభావవంతంగా ఉండే జర్నలిస్టులను ఎంపిక చేసుకోవడంతో పాటు ఏపీలో మంచి సంబంధాలున్న జర్నలిస్టులు, మరాఠీ, కన్నడ, తమిళం తెలిసిన జర్నలిస్టుల కోసం గాలింపు మొదలైపోయింది. మొత్తానికి కేసీఆర్ తన బీఆర్ఎస్‌ కోసం భారీగా ఖర్చు చేయడానికి రెడీ అవుతున్నట్లు చెప్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News