'పంచాయితీ' గా మారిన సీఎం కేసీఆర్ ప‌ట్టుద‌ల‌

Update: 2018-06-14 05:38 GMT
ప్ర‌య‌త్నిస్తే పోయేదేముంది? అనుకోవ‌టానికి బాగానే ఉంటుంది కానీ కొన్నిసార్లు మాత్రం అందుకు భారీ మూల్యాన్ని చెల్లించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. తాజాగా అలాంటి ప‌రిణామ‌మే ఎదుర‌వుతుంద‌ని గులాబీ నేత‌లు కిందామీదా ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే గులాబీ బాస్ మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌తి దానికి ప‌రేషాన్ ఎందుకు?  ఏం కాదంతే.. అంటూ ధీమాను ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

గ్రౌండ్ లెవెల్లో ప‌రిస్థితుల‌పై కేసీఆర్ స‌రిగా మ‌దింపు చేయ‌లేక‌పోతున్నార‌ని.. ఉన్న అధిక్యాన్ని త‌గ్గించుకునేలా సీఎం ఆలోచిస్తున్నార‌ని వాపోతోంది గులాబీ ద‌ళం. గ్రామ పంచాయితీల‌కు గ‌డువు లోపు ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. అయితే.. ఈ విష‌యంలో కేసీఆర్ ఆలోచ‌న‌కు భిన్నంగా గులాబీ నేత‌లు ఆలోచ‌న‌లు ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ప‌ది నెల‌ల ముందు గ్రామ పంచాయితీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. మొత్తం త‌మ ప‌ట్టులోకి వ‌స్తుంద‌న్న‌ది సీఎం కేసీఆర్ ఆలోచ‌న అయితే.. అంత సీన్ లేద‌ని.. గ్రామ‌స్థాయిలో తమ ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త కొత్త త‌ల‌నొప్పులు తెచ్చి పెట్టే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని గులాబీ నేత‌లు వాపోతున్నారు. దీంతో.. గ్రామ పంచాయితీల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయా?  లేదా?  అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. అంత‌కు మించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు దాదాపు ప‌ది నెల‌ల ముందు నిర్వ‌హించే పంచాయితీ ఎన్నిక‌ల‌పై సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌తో పాటు.. తాజాగా అమ‌లు చేసిన రైతుబంధు ప‌థ‌కం విశేష‌మైన ఆద‌ర‌ణ పొందింద‌ని.. దీంతో త‌మ ప్ర‌భుత్వానికి ద‌న్నుగా ప్ర‌జ‌లు నిలుస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు.

అంతేకాదు.. గ్రామ పంచాయితీల‌కు ఎన్నిక‌లు జ‌రిగితే కొత్త నాయ‌క‌త్వం తెర మీద‌కు రావ‌టంతో పాటు.. తెలంగాణ వ్యాప్తంగా ఎక్క‌డ‌.. ఎవ‌రి బ‌లం ఎంత‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా పార్టీ వ్య‌వ‌హ‌రించే తీరు.. సాధించే సీట్ల ఆధారంగా భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేయాల‌ని భావిస్తున్నారు. కేసీఆర్ ఆలోచ‌న‌లు ఈ తీరులో ఉంటే.. గులాబీ నేత‌ల వాద‌న మ‌రోలా ఉంది. పైకి అంతా బాగున్న‌ట్లు క‌నిపిస్తున్నాయి.. పార్టీ గుర్తు అతీతంగా జ‌రిగే ఎన్నిక‌ల్లో ఏ మాత్రం తేడా కొట్టినా.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని.. బ‌లాబ‌లాల లెక్క‌లో తేడా జ‌రిగితే ప్ర‌త్య‌ర్థికి చేతులారా అధిక్య‌త‌ను క‌ట్ట‌బెట్టిన‌ట్లు అవుతుంద‌న్న అనుమానాల్ని వ్య‌క్తం చేస్తున్నారు.

పంచాయితీ ఎన్నిక‌లు పార్టీ ర‌హిత‌మే అయిన‌ప్ప‌టికీ.. కొత్తగా స‌ర్పంచ్ ప‌ద‌వుల్లోకి వ‌చ్చే వారితో ఎమ్మెల్యే..ఎంపీ ఎన్నిక‌ల్లో అధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించాల‌న్న‌ది కేసీఆర్ ఐడియాగా చెప్పాలి. ఎన్నిక‌ల వేళ.. ఏదైనా తేడా జ‌రిగితే ఆ ప్ర‌భావం సార్వ‌త్రిక ఎన్నిక‌ల మీద ప్ర‌భావం చూపించే వీలుంద‌ని.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తొంద‌ర‌పాటు ఏ మాత్రం మంచిది కాద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌కు భిన్నంగా ఆలోచిస్తున్న గులాబీ నేత‌ల ఆలోచ‌న‌ల్ని అధినేత ఓకే చేస్తారా?  లేక‌.. తాను డిసైడ్ అయిన‌ట్లే పంచాయితీ ఎన్నిక‌ల‌కు వెళ‌తారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.


Tags:    

Similar News