నితిన్ గ‌డ్క‌రీని గుర్తు చేసిన కేసీఆర్‌

Update: 2019-04-03 09:23 GMT
అవునంటే కాద‌న‌లే.. కాదంటే అవున‌నేలే అన్న మాట‌ను గుర్తు చేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ప్ర‌ధాని మోడీని ఇత‌ర పార్టీ నేత‌లే ఏమీ అన‌లేని ప‌రిస్థితిల్లో సొంత పార్టీకి చెందిన నితిన్ గ‌డ్క‌రీ మాష్టారు ఈ మ‌ధ్య‌న పుల్ల పెట్టి కెలికిన‌ట్లుగా అప్పుడ‌ప్పుడు కెల‌క‌టం.. దానికి స్పంద‌న‌గా క‌ల‌క‌లం రేగ‌టం తెలిసిందే. మోడీకి ఎక్క‌డో త‌గిలేలా.. అప్పుడ‌ప్పుడు గ‌డ్క‌రీ చేసే న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లతో కొత్త చ‌ర్చ మొద‌లైంది.

గ‌డ్క‌రీ సారుకు మోడీని కెలికే సీన్ ఉందా? అంటే లేనే లేద‌ని చెప్పాలి. మ‌రి.. గ‌డ్క‌రీ ఎందుకంత సాహ‌సం చేస్తున్నారు?  ఆయ‌న వెనుకున్న‌ది ఎవ‌ర‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగింది. చివ‌ర‌కు తేల్చిందేమంటే.. సంఘ్ ప‌రివార్ గ‌డ్క‌రీ వెనుక ఉంద‌ని.. మోడీ తీరుతో అసంతృప్తితో ఉన్న సంఘ్ డైరెక్ష‌న్ లో భాగంగానే ఆయ‌న నోటి నుంచి అప్పుడ‌ప్పుడు అలాంటి వ్యాఖ్య‌లు వ‌చ్చేలా చేస్తున్నార‌ని చెబుతున్నారు.

మోడీ నిర్ణ‌యాల్ని త‌ప్పు ప‌ట్టేలా ఉండే ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేస్తున్న గ‌డ్కరీ ఒక్క‌సారిగా మోడీకి కౌంట‌ర్ పార్ట్ గా మారారు. ప్ర‌ధాని రేసులో ఆయ‌న ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఎందుకిలా?  అంటే.. సంఘ్ ప‌రివార్ కు కావాల్సింది ఇదే మ‌రి. మోడీని సైతం క‌ట్ట‌డి చేసే శ‌క్తి ఒక‌టి ఉంద‌న్న విష‌యం ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌టం.. అదే స‌మ‌యంలో తేడా వ‌స్తే మోడీని ప‌క్క‌న పెట్టేస్తామ‌న్న మాట‌ను సంఘ్ చెప్ప‌క‌నే చెప్పేసింద‌న్న మాట వినిపిస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. గ‌డ్క‌రీ మాట‌ల‌తో ఆయ‌న ప్ర‌ధాని రేసులోకి వ‌చ్చేశార‌న్న చ‌ర్చ అంత‌కంత‌కూ ఎక్కువ కావ‌ట‌మే కాదు.. ఆయ‌న్ను నేరుగా అడిగేసే ప‌రిస్థితి. నిజానికి గ‌డ్క‌రీకి కావాల్సింది కూడా అదే. అలా అని తాను ప్ర‌ధాని రేసులో ఉన్న‌ట్లు చెప్పే సీన్ ఆయ‌న‌కు లేదు క‌దా. అందుకే.. అరే.. నేనెందుకు ప్ర‌ధాని రేసులో ఉంటానంటూ ఆయ‌న క‌వ‌రింగ్ మాట‌లు చెప్పేస్తున్నారు. ఈ విష‌యాన్ని ఇక్క‌డికే క‌ట్ చేస్తే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర సీఎం  కేసీఆర్ మాట‌లు దాదాపుగా ఇలానే ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా ఆజంజాహి మిల్స్ మైదానంలో ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ.. ఈ గ్రౌండ్స్ లో స‌భ నిర్వ‌హించిన నేత‌లంతా ప్ర‌ధానులు అయ్యారంటూ పాత సెంటిమెంట్ ఒక‌టి బ‌య‌ట‌కు తీశారు. త‌న మాట‌ల‌తో అధినేత మ‌న‌సును దోచుకోవాల‌న్న‌ది ఎర్ర‌బెల్లి ఆశ‌. ఆయ‌న మాట బాగానే ఉన్నా.. అవును.. నేను ప్ర‌ధాని కావాల‌న్న మాట‌ను కేసీఆర్ నేరుగా చెప్ప‌లేరు క‌దా?  అందుకే మ‌న‌సులోని కోరిక‌ను దాచేసి.. అరే.. అదేం లేదు. నాకు ప్ర‌ధాని కావాల‌న్న ఆశ లేద‌ని చెప్పారు. ఢిల్లీలో చ‌క్రం తిప్పుతా.. దేశ రాజ‌కీయాల గ‌తిని మార్చేస్తా. స‌న్నాసి కాంగ్రెస్‌.. మ‌రో స‌న్నాసి బీజేపీల‌కు ప్ర‌త్యామ్నాయం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ మాట‌లే కాదు.. దేశంలో పుష్క‌లంగా ఉన్న వాడుకునే తెలివి నేత‌ల‌కు లేదంటూ కేసీఆర్ తిట్టిపోయ‌టం తెలిసిందే.

ఇన్ని మాట‌లు ఎందుకు? అంతిమంగా ప్ర‌ధాని కుర్చీలో కూర్చోవాల‌న్న ఆలోచ‌న‌తోనే క‌దా. అలా అని.. ఆ మాట‌ను ఓపెన్ గా ఒప్పుకుంటే కొత్త స‌వాళ్లు ఎదుర‌వుతాయి. అందుకే.. మ‌న‌సులో ఉన్న‌ ప్ర‌ధాని ఆశ‌ను బ‌య‌ట పెట్ట‌కుండా.. కేసీఆర్ చెబుతున్న మాట‌లు వింటుంటే.. అప్ర‌య‌త్నంగా నితిన్ గ‌డ్క‌రీ గుర్తుకు రావ‌టం ఖాయం. కాదంటారా? 
Tags:    

Similar News