ఎమ్మెల్యేల‌కు, జ‌ర్న‌లిస్టుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్‌

Update: 2022-02-02 03:30 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌స్య‌ల‌ను ఎలా డీల్ చేస్తారో , ఆ స‌మ‌యంలో ఎలా మాట్లాడుతారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఓ రేంజ్‌లో హాట్ టాపిక్‌గా న‌డుస్తున్న అంశానికి త‌న చాణ‌క్యంతో చెక్ పెట్ట‌గ‌ల‌రు. అందులోని వ‌ర్గాల‌ను ఖుష్ చేయ‌గ‌ల‌రు. తాజాగా తెలంగాణ‌లోని ఎమ్మెల్యేలు, జ‌ర్న‌లిస్టుల‌ను కేసీఆర్ ఓ రేంజ్‌లో సంతోష పెట్టారు. ఇదంతా ఎమ్మెల్యేలు , జ‌ర్న‌లిస్టులకు ఇళ్ల‌స్థ‌లాల గురించి. వారి కేంద్రంగా న‌డుస్తున్న వివాదాస్ప‌ద భూముల గురించి.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని జ‌ర్న‌లిస్టు వ‌ర్గాల్లో హాట్ టాపిక్ తాము ఇళ్లు క‌ట్టుకునేందుకు కేటాయించిన భూముల‌ను ప్ర‌భుత్వం ఓ కంపెనీకి ఇచ్చింద‌నే ప్ర‌చారం. 2007 నుంచి సీనియర్ జర్నలిస్టులుగా ఉన్న వారందరికీ హైదరాబాద్ లో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఆ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేట్ బషీరాబాద్,  నిజాంపేట ప్రాంతాలలో కొంత భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులను  గుర్తించి దాదాపు 1140 మందిని ఎంపిక చేశారు. వీరందరి నుంచి అప్పట్లో ఒక్కొక్కరి నుంచి రూ. రెండు లక్షల చొప్పున వసూలు చేసి 'జవహర్లాల్ నెహ్రూ  జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ" పేరుతో ప్రభుత్వ ఖాతాలో దాదాపు 22 కోట్ల రూపాయలను జమ చేసింది. అయితే, కొద్దికాలం తరువాత రాష్ట్ర హైకోర్టు జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వరాదని కొంతమంది వేసిన పిటీషన్ల ఆధారంగా ఈ ఉత్తర్వులు కొట్టివేసింది. దీంతో జ‌ర్న‌లిస్టులు మ‌ళ్లీ పిటిష‌న్ వేయ‌గా తుది తీర్పు వెలువ‌డాల్సి ఉంది. ఇదే పిటిష‌న్లో ఎమ్మెల్యేల స్థ‌లాల అంశం కూడా ఉంది.

దీంతో 2007 నుంచి ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు, అప్ప‌టి ఎమ్మెల్యేలు ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే, కాలక్రమేణా ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ, ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పలు దఫాలుగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఖచ్చితంగా మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని పలు సందర్భాలలో హామీ ఇచ్చారు. అయినప్పటికీ, ఆచరణలో పెట్టలేదు. ఇదే విషయంపై జర్నలిస్టులు ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కు కూడా వినతి పత్రాలు సమర్పించి అడిగినప్పుడు తాను బాధ్యత తీసుకుని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, అందులో, అందమైన భవనాలు నిర్మిస్తామని హామీలు ఇచ్చారు. తాజాగా జర్నలిస్టులకు కేటాయిస్తూ ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన స్థ‌లంలో ఐటీ ట‌వ‌ర్స్ ఏర్పాటుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీంతో షాక్ తిన‌డం పాత్రికేయుల వంతు అయింది.

త‌మ‌కు కేటాయించిన భూమిని ప్ర‌భుత్వం కంపెనీల‌కు ఇస్తుండ‌టం ప‌ట్ల జ‌ర్న‌లిస్టులు షాక్ తిన్నారు. సోష‌ల్ మీడియాలో అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తాజాగా సీఎం కేసీఆర్ నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఈ మేర‌కు ప‌లువురు పాత్రికేయుల త‌మ బాధ‌ను వెల్ల‌గ‌క్కారు. అయితే, దీనికి కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వచ్చే నెలలో జర్నలిస్టులు ఇళ్ల జాగలకు లైన్ క్లియ‌ర్ కానుంద‌ని తెలిపారు. ``సుప్రీంకోర్టులో కేసు ముగుస్తుంది. జ‌ర్న‌లిస్టు సొసైటీలలకు... కొత్త చట్టం తెస్తం. ఎమ్మెల్యేలకు, జర్నలిస్టులకు జాగలు తప్ప‌కుండా ఇచ్చే బాధ్యత నాది. ప్ర‌స్తుతం కేటాయించిన భూముల విష‌యంలో ఆందోళ‌న వ‌ద్దు. భూములు మస్తుగా ఉన్నయి. మీకు చివరకు మిగిలేది అవే స్థ‌లాలు. ఎమ్మెల్యేలు, జ‌ర్న‌లిస్టుల భూముల స‌మ‌స్య‌ల‌ మార్చిలో కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను`` అని సీఎం కేసీఆర్ భ‌రోసా ఇచ్చారు.
Tags:    

Similar News