కేసీఆర్ చండీయాగానికి చంద్రబాబు

Update: 2015-10-25 08:53 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు భారీ యాగానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ వస్తే ఆయూత మహా చండీయాగం నిర్వహిస్తానని మొక్కుకున్న నేపథ్యంలో త్వరలోనే మెదక్‌ జిల్లా జగదేవ్‌ పూర్‌ మండలంలోని ఎర్రవల్లిలో గల తన వ్యవసాయ క్షేత్రంలో ఈ యాగాన్ని నిర్వహించేందుకు కేసీఆర్‌ ఏర్పాట్లు చేయిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్‌ మూడో  వారంలో ఈ భారీ యాగం ఉండొచ్చని తెలుస్తోంది. పెద్ద ఎత్తున నిర్వహించనున్న యాగానికి ప్రధాని మోడీ - రాష్ట్రపతి ప్రణబ్ లను ఆహ్వానిస్తారని సమాచారం. వారితో పాటు మొన్న అమరావతిలో తనకు అత్యంత గౌరవమర్యదలతో చూసుకున్న కొత్త మిత్రుడు చంద్రబాబును కూడా పిలిచి గౌరవించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

కేసీఆర్‌ మొదటి నుంచీ చండీ ఉపాసనలో ఉన్నారు. తొలుత 2006లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సహస్ర చండీయాగం చేశారు. 2009లో మెదక్‌ జిల్లా కొండపాక మండలంలోని మర్పడ్గలో అమ్మవారిని ప్రతిష్టించారు. తెలంగాణ వస్తే ఆయూత మహా చండీయాగాన్ని నిర్వహిస్తానని కేసీఆర్‌ అప్పుడే మొక్కుకున్నారు. అమ్మవారి ప్రతిష్ట నుంచి నేరుగా సిద్ధిపేటలో(అక్టోబర్‌ 25) నిర్వహించిన తెలంగాణ ఉద్యోగుల సమరభేరికి వెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో ఈ ఉద్యోగుల సమరభేరి నాంది పలికిందని వేరే చెప్పనక్కర్లేదు. సభ తరువాతనే కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అమ్మవారి ప్రతిష్ట జరిగిన సరిగ్గా 40రోజులకే అంటే డిసెంబర్‌ 9, 2009న కేంద్రం తెలంగాణ ఏర్పాటు చేస్తూ ప్రకటన చేసింది. మొక్కిన మొక్కును తీర్చుకోవాలని అనుకున్నారు. అయితే, ఎప్పటికప్పుడు కేసీఆర్‌ తలపెట్టిన ఆయూత మహాచండీయాగం వాయిదా పడుతూ వస్తోంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకూడదన్న వేద పండితుల సూచన మేరకు సాధ్యమైనంత త్వరలో ఈ ఆయూత మహా చండీయాగాన్ని పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం.

ఈ నేపథ్యంలోనే డిసెంబర్‌ లో ఎర్రవల్లిలో గల తన వ్యవసాయ క్షేత్రంలో ఆయూత మహా చండీయాగాన్ని నిర్వహించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీ లిస్తున్నట్లు తెలుస్తోంది. లోక కల్యాణార్థం, దోష నివారణ, మొక్కులు తీర్చుకోవడం కోసం నిర్వహించే ఈ ఆయూత మహా చండీయాగం నిమిత్తం 10వేల చండీయాగ పారాయణాలు, 108 యజ్ఞ గుండాలను ఏర్పాటు చేస్తారని సమాచారం. 700 శ్లోకాలతో కూడిన చండీ సప్తశత, వెయ్యి అవనాలుంటాయని తెలుస్తోంది. ఈ ఆయూత మహా చండీయాగానికి కర్తగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఉండగా, ఐదు నుంచి 11రోజుల పాటు జరిగే ఈ భారీ యాగానికి దేశ నలుమూల నుంచి వెయ్యి మంది వరకు వేద బ్రహ్మణులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారీగా నిర్వహించే ఈ ఆయూత మహా చండీయాగానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ - ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబును, ఇతర ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు సమాచారం.
Tags:    

Similar News