కేసీఆర్ ను... ఇపుడు కోర్టు కూడా ప‌ట్టుకోలేదు

Update: 2016-01-05 15:17 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు-న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు అవినాభావ సంబంధం ఉంది. రాష్ర్ట ముఖ్య‌మంత్రిగా ఆయ‌న ప‌గ్గాలు చేప‌ట్టింది మొద‌లు తీసుకున్న అనేక నిర్ణ‌యాలు న్యాయ‌వ్య‌వ‌స్థ గుమ్మం తొక్కాయి. స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్‌ మెంట్‌ చెల్లింపు - ఫీజు రీయింబ‌ర్స్‌ మెంట్ ప‌థ‌కం మార్పు - అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత‌ - వినాయ‌క‌సాగ‌ర్ నిర్మాణం - సెక్ర‌టేరియ‌ట్ త‌ర‌లింపు - చాతి ఆస్ప‌త్రి మార్పు - చీప్ లిక్క‌ర్ ప్ర‌వేశ‌పెట్ట‌డం - గ్రేట‌ర్ ఎన్నిక‌లు - ఎమ్మెల్యేల అన‌ర్హ‌త‌...ఇలా తెలంగాణ ముఖ్య‌మంత్రి హోదాలో కేసీఆర్ తీసుకున్న‌ ఎన్నో నిర్ణ‌యాలు స్థానిక కోర్టులు మొద‌లు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాయి. అక్క‌డి నుంచి వ‌చ్చిన ఆదేశాల‌తో మార్పును సంత‌రించుకున్నాయి.

ఇలా ప‌లు సంద‌ర్భాల్లో కోర్టుల నుంచి అక్షింత‌లు వేయించుకున్న తెలంగాణ సీఎం ఇపుడు కొత్త కోణంలో నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ద‌ఫా కోర్టు ప‌రిధిలోకి చిక్క‌కుండా...వేరే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం లెక్క‌లోకి తీసుకొని మ‌రీ అడుగువేయ‌డం ఆస‌క్తిక‌రం. ఇంత‌కీ ఆ నిర్ణ‌యం ఏంటంటే గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారం. ప్ర‌చారానికి సుప్రీంకోర్టుకు సంబంధం ఏంటని అనుకోకండి. చేతికి మ‌ట్టి అంట‌కుండా కేసీఆర్ చేస్తున్న ప్ర‌చారం వ్యూహం అలా ఉంది మ‌రి.

సుప్రీంకోర్టు ఇటీవ‌ల విడుద‌ల చేసిన నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ముఖ్య‌మంత్రి ఫొటోతో ప్ర‌చారం నిర్వ‌హించ‌కూడ‌దు. దీనికి ప‌రిష్కారం ఆలోచించిన కేసీఆర్ తాజాగా వ‌రంగ‌ల్ జిల్లాలోని కేటీపీపీ థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేయ‌డం ద్వారా ప్ర‌చారం కానిస్తున్నారు. హైద‌రాబాద్ న‌గ‌రం నిండా ఉప‌యోగించిన ఫ్లెక్సీలో ఎక్క‌డా ప్ర‌భుత్వ చిహ్నం వాడ‌కుండా టీఎస్ జెన్‌ కో లోగోను ఉప‌యోగించారు. జెన్‌ కో కూడా ప్ర‌భుత్వం ప‌రిధిలోకే వ‌స్తుంది క‌దా అనే సందేహం రావ‌చ్చు. జెన్‌ కో స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి గ‌ల సంస్థ కాబ‌ట్టి సీఎం ఫొటో వాడుకున్న కోర్టు ఆదేశాల ప‌రిధిలోకి రాదు. దీంతో న‌గ‌రమంతా కేటీపీపీ జాతికి అంకితం-తెలంగాణ‌కు విద్యుత్ క‌ష్టాల తొల‌గింపు, కేసీఆర్ ప్ర‌య‌త్నాల‌కు గుర్తింపు పేరుతో ప్ర‌చారం. ఇదీ కేసీఆర్ లెక్క‌. ఇపుడు ప్ర‌తిప‌క్షాలు లేదా ఇంకే వ‌ర్గాలు కోర్టును ఆశ్ర‌యించినా కేసీఆర్ ఆ తీర్పు ప‌రిధిలోకి రానే రారు. రాజ‌కీయాల్లో అప‌ర చాణ‌క్యుడు అయిన సీఎం కేసీఆర్ ఇపుడు ప‌రిపాల‌న‌లోనూ అదే ముద్ర వేసుకుంటున్నార‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్ విశ్లేషిస్తోంది.
Tags:    

Similar News