14 ఏళ్లకు సీమాంధ్రలో అడుగిడుతున్న కేసీఆర్

Update: 2015-10-20 09:28 GMT
ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్ చేయటమే కాదు.. సీమాంధ్రలో అడుగు పెట్టకుండా తన డిమాండ్ ను పూర్తి చేసుకున్న విలక్షణమైన రాజకీయ నేత కేసీఆర్. తిరుమల దైవదర్శానానికి కొంతకాలం క్రితం వెళ్లినప్పటికీ.. సీమాంధ్రలో ఆయనకు ఆయనగా అడుగు పెట్టటం చాలా అరుదే. ఇంకా కచ్ఛితంగా చెప్పాలంటే ఇప్పటికి దాదాపు 14 ఏళ్లు అయ్యిందని చెప్పాలి.

ఇంత సుదీర్ఘకాలం తర్వాత ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం కోసం ఆయన సీమాంధ్రలో అడుగు పెట్టనున్నారు. ఈ నెల 22న జరిగే అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను ప్రత్యేక అతిధిగా వ్యవహరించి.. జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ప్రత్యేకంగా చెప్పటం చూస్తేనే కేసీఆర్ ప్రత్యేక ఏ పాటిదో అర్థమవుతుంది.

ఈ నెల21న సూర్యాపేటలో జరిగే కార్యక్రమంలో పాల్గొనే ఆయన.. ఆ రాత్రికి అక్కడే బస చేసి.. 22 ఉదయం సూర్యాపేట నుంచి గన్నవరం వరకూ హెలికాఫ్టర్ లో వెళ్లనున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో శంకుస్థాపన జరిగే ప్రాంతానికి వెళ్లనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంధ్రలో అడుగుపెట్టని ఆయన.. తెలంగాణలో ఉంటూనే తాను అనుకున్న డిమాండ్ ను సాధించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఎత్తుపల్లాలు.. ఆటుపోట్లు చవి చూసిన ఆయన.. ఒకదశలో తెలంగాణ ఉద్యమానికి సీమాంధ్రుల మద్ధతు కోరేందుకు ఆ ప్రాంతంలో పర్యటించాలని భావించారు. కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత 2010లో కత్తి పద్మారావు విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేసీఆర్ ను రావాలని ఆహ్వానించటం.. ఆయన ఓకే చెప్పటం జరిగింది. కానీ.. లైలా తుఫాను కారణంగా ఆయన పర్యటన రద్దు అయ్యింది.  ఇలా కొన్నిసార్లు ఏపీకి రావాలని కేసీఆర్ భావించినా ఆయన రాలేని పరిస్థితి. తాజాగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి పిలిచిన నేపథ్యంలో ఆయన తాను వస్తానని చెప్పారు. దీంతో.. పద్నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సీమాంధ్రలోకి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో అడుగు పెట్టనున్నారు.
Tags:    

Similar News