కేసీఆర్ ను మాయ చేసేస్తున్నారా?

Update: 2017-12-08 05:01 GMT
వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. తాను అనుకుంటే ఎంత‌టివారికైనా సిత్రం చూపించే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు తాజాగా సినిమా క‌నిపించింది. ఏసీ గ‌దుల్లో కాన్ఫరెన్స్ హాట్లో కూర్చొని ఉన్న‌ప్పుడు చెప్పే మాట‌ల‌కు వాస్త‌వానికి మ‌ధ్య అంత‌రం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా క‌నిపించింది.

ముఖ్య‌మంత్రి ప‌ర్స‌న‌ల్ గా తీసుకున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో జ‌రుగుతున్న ప‌నుల్ని తెలుసుకోవాల‌నిపించిన కేసీఆర్ ప్రాజెక్టు ప‌నులు జ‌రుగుతున్న ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్న ప్రాజెక్టు ప‌నులు ఎంత‌లా జ‌రుగుతున్నాయి?  పెండింగ్ వ‌ర్క్ ఎంత‌?  తాము అనుకున్న గ‌డువుకు ప్రాజెక్టు పూర్తి అవుతుందా?  రైతాంగానికి తానిచ్చిన హామీ ఎంత‌వ‌ర‌కూ అమ‌లైంద‌న్న విష‌యాల్ని తెలుసుకోవాల‌నిపించిన కేసీఆర్‌.. ప్రాజెక్టు ప‌రిశీల‌న‌కు వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న అవాక్కు అయ్యే ప‌రిణామాలు క‌నిపించాయి. కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి చెప్పే మాట‌ల‌కు చేత‌ల‌కు మ‌ధ్య అంత‌రం ఎంత‌న్న విష‌యం ఆయ‌న‌కు అర్థ‌మైంది. ఎన్ని షిఫ్టుల్లో ప‌ని చేస్తున్నారంటూ కాళేశ్వ‌రం ప్రాజెక్టు కాంట్రాక్ట‌ర్ల‌ను అడిగిన‌ప్పుడు ఒక్క షిఫ్ట్ లో ప‌ని చేస్తున్న‌ట్లుగా చెప్ప‌టం గ‌మ‌నార్హం.

ఈ స‌మాధానాన్ని ఊహించ‌ని కేసీఆర్ ఒక్క‌సారి అవాక్కు అయ్యార‌ని చెబుతున్నారు. మామూలుగా అయితే.. కేసీఆర్ శివ‌తాండ‌వం చేసేవారు. కానీ.. ప్రాజెక్టు కాంట్రాక్ట‌ర్ మీద అభిమాన‌మో.. మ‌రో కార‌ణ‌మో కానీ ఇలా అయితే ప్రాజెక్టు ప‌ని ఎప్పుడు పూర్తి అవుతుంద‌న్న సూటి ప్ర‌శ్న వేయ‌ట‌మే కాదు.. ఇక‌పై మూడు షిఫ్ట్ ల‌లో ప‌నులు జ‌ర‌గాల‌న్న ఆదేశాల్ని జారీ చేశారు.

తెలంగాణ రైతాంగానికి తాను మాట ఇచ్చాన‌ని.. గ‌డువు తేదీలోపు ప‌ని పూర్తి కావాల‌న్న మాట వ‌చ్చింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు ప్ర‌భుత్వం చాలా ప్రాధాన్యం ఇస్తుంద‌ని.. ఈ విష‌యాన్ని కాంట్రాక్ట్ ఏజెన్సీలు. అధికారులు గుర్తించి ప‌ని చేయాల‌ని.. జూన్ నాటికి పంప్ హౌస్ ప‌నులు పూర్తి అయి నీళ్లు పారించాలని.. ప‌నుల్లో మ‌రింత వేగం పెర‌గాల‌ని.. అవ‌స‌ర‌మైతే ప్ర‌భుత్వం నుంచి మ‌రింత స‌హ‌కారం అందిస్తామ‌ని చెప్పారు. వ‌చ్చే వానాకాలంలో గోదావ‌రి నీరు ఒక్క చుక్క కూడా వృధాగా కిందికి పోవ‌ద్దంటూ ఆయ‌న ఆదేశించారు. ఎంత‌టి వ‌ర‌ద వ‌చ్చినా త‌ట్టుకునేలా నిర్మాణం ఉండాల‌ని.. ఆ విష‌యంలో అస్స‌లు రాజీ  ప‌డొద్ద‌న్నారు. ప్రాజెక్టు ప‌నుల స‌మీక్ష‌కు మ‌రో 15 రోజుల్లో వ‌చ్చి మ‌రోసారి తాను స‌మీక్షిస్తాన‌ని చెప్పారు. మ‌రి.. కేసీఆర్ మాట‌ల‌కు కాంట్రాక్ట్ సంస్థ‌.. అధికారులుఎంత‌గా రియాక్ట్ అయ్యార‌న్న‌ది మ‌రో రెండు వారాల్లో తేల‌నుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News