‘‘ఇక నుంచి.. కవిత మాదిరే నువ్వూ నా బిడ్డవే’’

Update: 2015-07-19 04:09 GMT
కన్నతండ్రి చేతిలో నరకం అంటే ఏమిటో చూసిన ప్రత్యూష శనివారం తీవ్ర భావోద్వేగంతో కదిలిపోయారు. సింక్ లో పడేసిన అన్నం పెడుతూ.. నిత్యం బెల్ట్ దెబ్బలు కొడుతూ.. అప్పుడప్పుడు బాత్రూం యాసిడ్ తాగిస్తే పిశాచి లాంటి పినతల్లి చేతిలో ఏడాదిన్నర పాటు పడిన కష్టాలతో జీవితం అంటేనే వణికిపోతున్న ఆమెకు కొండంత భరోసా లభించింది.

కథల్లో.. సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే దృశ్యం (సీన్) రియల్ లైఫ్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కారణంగా చోటు చేసుకుంది. తన భార్య.. కూతుర్ని వెంట పెట్టుకొని గ్లోబల్ ఆసుపత్రికి వచ్చిన కేసీఆర్ చెప్పిన మాటలు అక్కడి వారి నోట మాట రాకుండా చేశాయి. సాయం చేస్తానని చెప్పటం ఒక ఎత్తు.. తానే సాయం చేయటం మరో ఎత్తు. అధికారంలో ఉన్న వారు.. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు మొదటిది చేస్తుంటారు. కానీ.. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా రెండో మార్గాన్ని ఎంచుకోవటం ఆసక్తికరంగా మారింది.

తీవ్ర గాయాలతో.. అనారోగ్యంతో తల్లడిల్లుతున్న ప్రత్యూష గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందటం తెలిసిందే. ఆమెకు నయమయ్యాక తర్వాత ఏమిటన్న దానికి.. ముఖ్యమంత్రి కేసీఆర్ సూటిగా.. స్పష్టంగా సమాధానం చెప్పేశారు. నాది బాధ్యత అన్న మాటను ఆయన ఎంత వివరంగా చెప్పారంటే.. ‘‘నా కూతురు (ఎంపీ కవిత) మాదిరే.. ఇక నుంచి నువ్వూ నా కూతురివే. నీకు ఆరోగ్యం నయమయ్యాక నా ఇంటికే తీసుకెళతా. అక్కడ నీకు బాగయ్యే వరకూ నాతోనే ఉంచుకుంటా. ఆ తర్వాత మంచి చదవు చదివిస్తా. మంచి వసతి గృహంలో బస ఏర్పాటు చేయిస్తా. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి. భవిష్యత్తులో ఎవరికైనా ఇలాంటి ఆపద ఎదురైతే నువ్వు వాళ్లను ఆదుకునే స్థాయికి చేరుకోవాలి. నీకు అండగా నేనుంటా. ఎంత ఖర్చు అయినా సరే.. నీ ఆరోగ్యం బాగయ్యే వరకూ వైద్య ఖర్చులు.. నీ చదవు ప్రభుత్వమే చూసుకుంటుంది. మంచి అబ్బాయిని చూసి నా సొంత ఖర్చులతో పెళ్లి చేస్తా. ఇల్లు కట్టిస్తా. నాకెవరూ లేరని బాధ పడొద్దు. ఎవరో ఏదో చేస్తారని భయపడొద్దు. నీకు నయం కాగానే మా ఇంటికే రా. నీకు ముఖ్యమంత్రి కేసీఆర్ తోడున్నడు. పోలీసులను కాపలాగా ఉంచుతా. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా నిన్న బిడ్డలా చూసుకుంటడు. నా కూతురిలా (పక్కనున్న ఎంపీ కవితను చూపిస్తూ) నిన్ను చూసుకుంటా.. ధైర్యంగా ఉండు’’ అంటూ ధైర్యం చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు ప్రత్యూష చలించిపోయింది. తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగిన కేసీఆర్ కు ప్రత్యూష వివరాలు చెబుతూ.. సవతి తల్లి కొడుతున్నట్లు కలలు వస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తనను ఈ స్థితికి తీసుకొచ్చిన సవతితల్లి.. తండ్రిని కఠినంగా శిక్షించాలని కోరింది. వారిని బయటకు రాకుండా చూడాలంది. ఏం కోర్సు చేయాలని ఉందంటూ కేసీఆర్ అడిగితే.. బీఎస్సీ నర్సింగ్ చేయాలని ఉందన్న ప్రత్యూషను.. నీ ఇష్టప్రకారమే నీకు నచ్చిన కోర్సు చేద్దవని ఆయన  భరోసా ఇచ్చారు. ఎవరికైనా ఏదైనా కష్టమొస్తే స్పందిస్తారు. కానీ..  కేసీఆర్ మాదిరి స్పందించటం మాత్రం సాధ్యం కాదేమో.
Tags:    

Similar News