కేసీఆర్ మొదలు పెట్టారు.. తమిళ ‘సై’ అన్నారు

Update: 2022-03-06 04:20 GMT
ఆమె రాకతోనే ఎన్నో అంచనాలు.. మరెన్నో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తిరుగులేని అధిక్యతతో దూసుకెళుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడుకు కళ్లాలు వేసే సరైన వ్యక్తిని గవర్నర్ గా ఎంపిక చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని తమిళ సై పేరును ప్రకటించినంతనే చాలా మంది నోట వినిపించిన మాటగా చెప్పాలి.

అయితే.. ఈ అంచనాలకు భిన్నంగా..తమిళ సై ఆచితూచి అడుగులు వేశారే కానీ.. తొందరపాటును ప్రదర్శించింది లేదు. కేసీఆర్ ను టార్గెట్ చేసేందుకే తనను గవర్నర్ ను చేశారన్న అభిప్రాయం తప్పన్నట్లుగా ఆమె తీరు ఉండేది.

తాజాగా కొత్త యుద్ధానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తెర తీస్తే.. తీవ్రమైన మదింపు అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రెండు రోజుల ముందు గవర్నర్ తమిళ సై గళం విప్పారు. ప్రెస్ నోట్ రూపంలో ఆమె కేసీఆర్ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ లేఖాస్త్రాన్ని సంధించారు.

గవర్నర్ లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటాన్ని ఆమె తీవ్రంగా తప్పు పట్టారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించాలన్న నిర్ణయం సీఎం కేసీఆర్ తీసుకోవటం.. దానికి సాంకేతిక అంశాన్ని చూపిస్తూనే.. బీజేపీ సైతం పలు రాష్ట్రాల్లో ఇలాంటి తీరునే ప్రదర్శించిందంటూ గతాన్ని గుర్తు చేస్తూ.. తమ మీద విమర్శలు చేస్తున్న వారికి కౌంటర్ ఇవ్వటం తెలిసిందే.

సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురూ అవుతున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉండటం.. అనంతరం గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అధికార.. విపక్ష నేతలు తమ వాదనల్నివినిపించటం సంప్రదాయంగా వస్తూనే ఉంది.

అయితే.. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రగతిభవన్ కు రాజ్ భవన్ కు మధ్య అంతరం పెరిగినట్లుగా చెబుతున్నారు.

ఈ వాదనను నిజం చేస్తూ.. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాల్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ డిసైడ్ చేయగా.. శనివారం రాత్రి కాస్తంత పొద్దుపోయిన తర్వాత రాజ్ భవన్ నుంచి విడుదలైన మీడియా ప్రకటనలో.. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు గవర్నర్ తమిళ సై. రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టిన ఆమె.. తన అసంత్రప్తిని బాహాటంగానే చెప్పేశారు.

''బడ్జెట్ సమావేశాలు తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ సంప్రదాయాన్ని ప్రభుత్వం కొనసాగించలేదు. కొత్త సెషన్ కాకపోవటంతో గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది. సాంకేతిక కారణంతో ప్రసంగాన్ని రద్దు చేసింది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వ నిర్ణయంతో శాసన సభ్యుల హక్కులకు విఘాతం కలుగుతుంది. ఆర్థిక బిల్లు ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిఫార్సు కోరింది. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పింది. ఇప్పుడు ఇలా అనటం సరికాదు'' అని పేర్కొంది.

అంతేకాదు.. గవర్నర్ ప్రసంగాన్ని గవర్నర్ కార్యాలయం తయారు చేయదని.. అది ప్రభుత్వం రాసిచ్చే ప్రకటనేనని పేర్కొన్నారు. 'గతేడాది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, విజయాలతోపాటు తదుపరి ఏడాదికి సంబంధించిన విధాన సూచికల ప్రగతి నివేదికే గవర్నర్‌ ప్రసంగం.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల గతేడాది ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోతున్నారు' అని గవర్నర్ తన ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ మేరకు  రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది.
Tags:    

Similar News