రాకాసితో పోరాడా..గోకాసి లెక్కే కాదు: కేసీఆర్

Update: 2018-11-27 06:43 GMT
నాలుగున్న‌రేళ్లు పార్టీ త‌ర‌ఫున ప‌ద‌వులు అనుభ‌వించి ఆపై త‌న‌కే స‌వాలు విసిరిన కొండా దంప‌తుల‌కు గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ కోసం తాను రాకాసితోనే పోరాడాన‌ని.. ఇలాంటి గోకాసిలు లెక్కే కాద‌ని హూంక‌రించారు. ఒక్క తొక్కుడు తొక్కి కొండా దంప‌తుల‌కు జాడ లేకుండా చేయాల‌ని ఓట‌ర్ల‌కు పిలుపునిచ్చారు.

కొండా దంప‌తులు టీఆర్ ఎస్‌ ను వీడిన అనంత‌రం కేసీఆర్‌ - కేటీఆర్‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అనంత‌రం వారు కాంగ్రెస్‌లో చేరారు. త‌మ స‌త్తా ఏంటో కేసీఆర్‌కు చూపిస్తామ‌ని స‌వాల్ విసిరారు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్‌గా పేరు పొందిన సురేఖ బాగానే రెచ్చిపోయారు. దొర‌త‌నం ప్ర‌ద‌ర్శిస్తున్నారంటూ కేసీఆర్‌ ను ల‌క్ష్యంగా చేసుకొని ధ్వ‌జ‌మెత్తారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో క‌నీసం 5-6 స్థానాలు గెలిపించి కాంగ్రెస్‌ కు కానుక‌గా ఇస్తామంటూ శ‌ప‌థం చేశారు.

ప్ర‌స్తుతం సురేఖ ప‌ర‌కాల నుంచి బ‌రిలో ఉన్నారు. ఆమె ప్ర‌త్య‌ర్థి - సిట్టింగ్ ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి. ప‌ర‌కాల‌లో సోమ‌వారం టీఆర్ ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌కు కేసీఆర్ హాజ‌ర‌య్యారు. కొండా దంప‌తుల‌పై త‌న‌కున్న క‌సినంతా ప్ర‌సంగంలో బ‌య‌ట‌పెట్టారు. నేరుగా పేర్లు ప్ర‌స్తావించ‌కుండానే ప‌రోక్షంగా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. నాయ‌కులు కాకుండా ప్ర‌జ‌లు గెలిచే ప‌రిస్థితి రావాల‌ని సూచించారు. ధ‌ర్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు.

కొండా దంప‌తుల పేర్లు ప్ర‌స్తావించ‌కుండానే.. వారిని రౌడీలుగా కేసీఆర్ ప‌రోక్షంగా అభివ‌ర్ణించారు. అయినా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌ర‌మేం లేద‌ని అన్నారు. రౌడీల‌కు రౌడీల‌కు 8 చేతులేమీ ఉండ‌వ‌ని.. వాళ్లు కూడా మ‌న‌లాగే మ‌నుషులేన‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు అణిగిమ‌ణిగి ఉన్నంత వ‌ర‌కే రౌడీలు రాజ్యమేలుతార‌న్నారు. ఒక్క తొక్కుడు తొక్కితే వాళ్లు జాడ లేకుండా పోతార‌ని సూచించారు. తెలంగాణ కోసం తాను రాకాసీతోనే పోటీప‌డ్డాన‌ని.. ఈ గోకాసితో ఏం కాద‌ని కొండా దంప‌తుల‌ను ఎద్దేవా చేశారు.

   

Tags:    

Similar News