ఆ పంట వేయొద్దు.. రైతుల‌కు కేసీఆర్ హెచ్చ‌రిక‌!

Update: 2021-09-13 05:27 GMT
కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద ఐదు సంవ‌త్స‌రాల‌కు స‌రిప‌డ్డ బాయిల్డ్ రైస్ నిల్వ‌లున్నాయి. కొత్త‌గా అద‌నంగా బియ్యాన్ని కేంద్రం సేక‌రించే ప‌రిస్థితి లేదు, కేంద్రం చెప్పిన స్థాయిలో త‌ప్ప రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా అద‌న‌పు స్థాయిలో రైతుల నుంచి బియ్యాన్ని సేక‌రించే ప‌రిస్థితి లేదు.. ఇలాంటి ప‌రిస్థితుల్లో వ‌రిసాగును తెలంగాణ రైతాంగం వీలైనంత స్థాయిలో త‌గ్గించుకోవాల‌ని సూచిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేవ‌లం సూచించ‌డ‌మే కాదు.. ఇక‌పై వరి సాగు చేయ‌డం అంటే.. ఉరివేసుకున్న‌ట్టే అన్న‌ట్టుగా ఆయ‌న రైతుల‌ను హెచ్చ‌రించిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కేసీఆర్ అన్నార‌నే కాదు.. వాస్త‌వంలో కూడా ప‌రిస్థితి అలానే ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో వ‌రి సాగు విప‌రీతంగా పెరిగింది. గ‌త రెండేళ్ల‌లో మంచి స్థాయిలో వ‌ర్షాలు కురిశాయి. ఫ‌లితంగా బావులు, బోర్ల కింద విప‌రీతంగా వ‌రి సాగ‌య్యింది. ఇక ప్రాజెక్టుల కింద వ‌రి సాగు చేసే వాళ్ల సంగ‌తి స‌రే స‌రి. ప్రాజెక్టుల కింద వ‌రి సాగ‌యితేనే.. మిగ‌తా ప్రాంతాల‌కు కూడా కావాల్సిన‌న్ని బియ్యం పండుతాయి. అయితే ఇప్పుడు బావులు, బోర్ల కింద కూడా మంచి స్థాయిలో సాగు నీరు అందుబాటులోకి వ‌చ్చాయి. భూగ‌ర్భ జ‌లాల స్థాయిపెరిగింది. ఇలాంటి నేప‌థ్యంలో రైతులు విప‌రీతంగా వ‌రి సాగు చేస్తున్నారు.

గ‌త ఏడాది సాగు చేసిన వ‌రికి సంబంధించిన బియ్యాన్నే చాలా చోట్ల రైతులు అమ్ముకోలేక‌పోతున్నారు. మంచి క్వాలిటీ ఉన్న బియ్యం తేలిక‌గా అమ్ముడ‌వుతున్నాయి కానీ, కొన్ని ర‌కాల వరి ధాన్యం అమ్ముకోవ‌డం క‌ష్ట‌మ‌వుతోంది రైతుల‌కు కూడా. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల రైతులు బియ్యం ఇళ్ల‌లో పెట్టుకుని ఉన్నారు. అమ్ముదామ‌న్నా కొనే వారు క‌న‌ప‌డ‌టం లేదు. విప‌రీతంగా సాగు చేయ‌డ‌మే దీనికి ఒక కార‌ణంగా క‌నిపిస్తూ ఉంది. ఇక ఈ సారి కూడా రికార్డు స్థాయిలో వ‌రి సాగ‌యిన‌ట్టుగా ఉంది. ఈ ప‌రిస్థితుల్లో వ‌రి సాగు గురించి తెలంగాణ సీఎం స్పందించిన‌ట్టుగా ఉన్నారు.

వ‌రికి బ‌దులు రైతులు శ‌న‌గ‌, వేరుశ‌న‌గ‌, నువ్వులు, మినుములు వంటి పంట‌లు సాగు చేయాల‌ని కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి సూచిస్తున్నారు.
Tags:    

Similar News