కేసీఆర్ వార్నింగ్ ఇచ్చేశారు.. అర్థమవుతుందా?

Update: 2020-03-28 05:39 GMT
ధీమాగా ఉండటమే కాదు.. తన మాటలతో రాష్ట్రంలోని వారంతా ధీమాగా ఫీలయ్యేలా చేసే గుణం ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతం. కరోనా లాంటి ప్రమాదకర వైరస్ వేళ.. అనవసరంగా ఆందోళన చెందకుండా ఏమేం చేస్తే సరిపోతుందన్న విషయాన్ని ఆయన తరచూ చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరేళ్లలో పది రోజుల వ్యవధిలో ఇన్నిసార్లు మీడియాతో మాట్లాడటం అన్నది ఇదే తొలిసారిగా చెప్పొచ్చు. కరోనా వైరస్ ఎపిసోడ్ కు కేసీఆర్ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారన్న దానికి ఇదో ఉదాహరణ.

తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా తెలంగాణ పరిస్థితి మీద ఇప్పటికి ఆయన భరోసాతోనే ఉన్నారు. కాకుంటే.. తాను చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా అమలు చేస్తే సమస్యలనేవి పెద్దగా రావన్నది ఆయన మాట. ప్రజల చేతిలో ఉన్న ఏకైక ఆయుధం వైరస్ ను వ్యాప్తి చెందకుండా ఆపటమేనని.. అందుకు ప్రజలు గుంపులు గుంపులుగా గుమికూడకుండా ఉండే సరిపోతుందని చెబుతున్నారు. వెంటిలేటర్లు.. వైద్య సౌకర్యాలు విదేశాల్లో ఉన్నంత లేవన్న వాస్తవాన్ని ఒప్పుకుంటూనే.. కలిసి కట్టుగా వైరస్ మీద పోరు చేస్తే.. కరోనా మహమ్మారిని అదుపులోకి ఉంచటం పెద్ద విషయం కాదన్నది ఆయన వాదన.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి వేగంగా ఉంటుందన్న విషయాన్ని చెబుతూ.. తీవ్రమైన హెచ్చరికను చేశారు. శుక్రవారం ఒక్కరోజులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అయిన విషయాన్ని ప్రస్తావిస్తూనే.. అందులో విదేశాల నుంచి వచ్చిన వారే అధికంగా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. అలా వచ్చిన వారి కుటుంబ సభ్యులకు వ్యాపించిందని.. మరింత ఆందోళన చెందొద్దన్నట్లుగా భరోసాను కల్పించారు. అలా అని విషయాన్ని లైట్ గా తీసుకోవద్దని.. కరోనా వచ్చిన వారి నుంచి మరొకరుకు సోకే పరిస్థితి మన దగ్గరా మొదలైందని.. అది కూడా కొందరు మూర్ఖంగా వ్యవహరించటం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 20వేల మంది హోం క్వారంటైన్.. ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న విషయాన్ని చెప్పారు.

గతానికి భిన్నంగా ప్రపంచ గణాంకాల్ని.. అమెరికాలో చోటు చేసుకున్న పరిస్థితుల్ని ప్రస్తావించిన కేసీఆర్.. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని చెప్పేశారు. ఆయన చెప్పిన మాటల్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Tags:    

Similar News