అసెంబ్లీలో మోడీని, రఘునందన్ ను కలిపి కడిగేసిన కేసీఆర్

Update: 2022-09-12 07:29 GMT
తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాని నరేంద్రమోడీపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ 'మోర్ ఫాసిస్ట్ ప్రధాని' అని ఆనాడే చెప్పానని అన్నారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందని.. సీలేరు పవర్ ప్లాంట్, ఏడు మండలాలను లాక్కున్నారని గుర్తు చేశారు. కేంద్రం విద్యుత్ బిల్లుపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.

కేంద్ర విద్యుత్ సంస్కరణ బిల్లుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ అసెంబ్లీలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లుపై స్వల్పకాలిక చర్చ సాగింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రసంగిస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని కౌంటర్ ఇచ్చారు.

ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు తలుచుకుంటే భయమేస్తుందని కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో సీలేరు పవర్ ప్రాజెక్టును తెలంగాణకు కేటాయించారన్నారు. నరేంద్రమోడీ నేతృత్వంలో ఏర్పాటైన కేంద్రప్రభుత్వం 2014లో తొలి కేబినెట్ సమావేశం తెలంగాణకు చెందిన ఏడు మండలాలను లాక్కున్నారన్నారు.

అంతేకాదు సీలేరు పవర్ ప్రాజెక్టును కూడా తీసుకున్నారన్నారు. అప్పటి సీఎం చేతిలో కీలుబొమ్మగా మారి నరేంద్రమోడీ తెలంగాణకు అన్యాయం చేశాడన్నారు. ఈ విషయమై తెలంగాణలో బంద్ నిర్వహించిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. నరేంద్రమోడీ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు.

నరేంద్రమోడీ ఫాసిస్ట్ ప్రధాని ఆనాడే తాను చెప్పినట్టుగా కేసీఆర్ తెలిపారు. తాము లోక్ సభను ఐదురోజుల పాటు అందుకే స్తంభింప చేసినట్టుగా కేసీఆర్ సభ దృష్టికి తీసుకొచ్చారు. పార్లమెంట్ లో విపక్ష సభ్యులు మాట్లాడకుండా అధికార బీజేపీ సభ్యులు అడ్డుకుంటున్నారని కేసీఆర్ విమర్శించారు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఉచిత విద్యుత్ ఇస్తారని బీజేపీ హామీ ఇచ్చిందని.. కానీ ఇప్పుడు విద్యుత్ మీటర్లు పెడుతున్నారని విమర్శిస్తున్నారు. ఈ పద్ధతిని నిరసిస్తూ యూపీ రైతులు ఆందోళన చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.

విద్యుత్ సంస్కరణలు అంటూ రైతులను దగా చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. పక్కనే ఏపీలోనూ దీన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మోటార్లకు మీటర్లు పెట్టనివ్వమని స్పష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News