కేఈ ప్ర‌తిజ్ఞ‌: నీళ్లిస్తేనే పూల‌దండ‌లు!

Update: 2017-10-03 11:30 GMT
రాజ‌కీయాల్లో పూల‌దండ‌లు - పొగ‌డ్త‌లు కామ‌న్‌. ఈ రెండూ లేకుండా నేత‌ల‌కు ఏ కార్య‌క్ర‌మ‌మైనా ర‌క్తి క‌ట్ట‌దు. ఇక‌, సీఎం చంద్ర‌బాబు లాంటి వాళ్ల‌కైతే.. త‌నకు తానే పొగుడు కొంటూ.. త‌న‌కు తానే డ‌ప్పుకొట్టుకోవ‌డం పాల‌న‌తో పెట్టిన విద్య‌గా అబ్బిపోయింది. ఎక్క‌డికెళ్లి ఎలాంటి మైకు ప‌ట్టుకున్నా.. త‌న‌పైత‌నే పొగ‌డ్తల ప్ర‌వాహాన్ని ప్ర‌వ‌హింప జేసుకుంటూ ప‌ర‌వ‌శించి పోతుంటారు చంద్ర‌బాబు. ఇలా ఆయ‌న కేబినెట్‌లో మ‌రికొంత మంది మంత్రులు ఉన్న‌ట్టు స‌మాచారం.

అయితే, రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి - సీమ‌కు చెందిన సీనియ‌ర్ నేత కేఈ కృష్ణ‌మూర్తి మాత్రం చాలా భిన్నంగా స్పందించారు. అభివృద్ధి ప‌నుల విష‌యంలో తాను నిఖార్సుగా ఉంటాన‌ని ఆయ‌న చెప్పారు. ఏ ప‌నీ చేయ‌కుండా చేశాన‌ని చెప్ప‌డం, పూర్తి కాక‌పోయినా పూర్త‌యింద‌ని చెప్పి పూలు జ‌ల్లించుకోవ‌డం త‌న వ‌ల్ల‌కాద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ప్రస్తుతం నీరు లేక రైతులు అల్లాడుతున్న విష‌యం త‌న‌కు తెలుసున‌ని, కాబ‌ట్టి వారికి త్వ‌ర‌లోనే నీరిచ్చే ఏర్పాట్లు చేస్తాన‌ని చెప్పారు. అంతేకాదు, హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా 106 చెరువులకు నీళ్లు ఇచ్చినప్పుడే పూలదండలు వేయించుకుంటానని ప్ర‌తిజ్ఞ చేశారు.

నిజానికి మంగళవారం మంత్రి కేఈ పుట్టిన రోజు. అయితే... వేడుకలు జరిపేందుకు, శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు కార్యకర్తలు - అభిమానులు ఆయన ఇంటికి వచ్చారు. అయితే, అనూహ్యంగా  పుట్టిన రోజు వేడుకలకు తాను దూరంగా ఉంటున్నానని, హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా 106 చెరువులకు నీళ్లు ఇచ్చినప్పుడే పూలదండలు వేయించుకుంటానని కార్యకర్తలకు చెప్పారు. దీంతో ఆయ‌న అభిమానులు స‌హా పార్టీ కార్య‌క‌ర్త‌లు ఖంగుతిన్నారు. ఇది నిజ‌మేనా? అని ఒక‌రి ముఖాలు ఒక‌రు చూసుకున్నారు. అయితే, వీరిని గ‌మ‌నించిన మంత్రి కేఈ.. తాను చెప్పింది నిజ‌మేన‌ని, నీళ్లిచ్చిన‌ప్పుడు మాత్ర‌మే పూల దండులు వేసుకుంటాన‌ని చెప్ప‌డంతో  చేసేదేమీ లేక కార్యకర్తలు తమ నాయకుడి పట్టుదలకు జై కొడుతూ.. ఇంటి బాట పట్టారు.
Tags:    

Similar News