బోనులో మాల్యా..మంచోడిన‌ని వివ‌ర‌ణ‌

Update: 2017-06-13 15:50 GMT
బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి లండన్ లో ఉంటున్న లిక్క‌ర్ కింగ్ విజ‌య్‌ మాల్యాని భారత్ కు అప్పగించే కేసు విచారణ అక్కడి వెస్ట్ మినిస్టర్ కోర్టులో జరిగింది. ఈ కేసు విచారణకు మాల్యా హాజరయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పారు. భారత్ విడిచి లండన్ పారిపోయిన తర్వాత తొలిసారిగా మాల్యా మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి చట్టవిరుద్దమైన పనులు చేయలేదని సమర్థించుకున్నారు. కేసు నుంచి బయట పడేందుకు అవసరమైన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని లిక్కర్ కింగ్ స్ప‌ష్టం చేశారు.

మ‌రోవైపు కోర్టులో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం చోటుచేసుకుంది. భార‌త ప్ర‌భుత్వం పిటిష‌న్ అనుస‌రించి వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టులో మ‌న‌దేశానికి మాల్యాను అప్పగించే కేసు విచారణ ప్రారంభమైంది. అయితే కొద్ది సేపటికే కేసును జులై 6కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అంతేకాదు.. మాల్యాకు మంజూరు చేసిన బెయిల్‌ ను మరో ఆరునెలలు(డిసెంబర్‌ దాకా) పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కోర్టు తీర్పుతో మాల్యాలో హుషారు రెట్టింపైంది. ఇది మీడియాతో మాట్లాడుతున్న స‌మ‌యంలో స్ప‌ష్టంగా క‌నిపించింది. క్రికెట్ మ్యాచ్ సంద‌ర్భంగా ఓవెల్ మైదానంలో తనను ఎవరూ దొంగా అని అనలేదని చెప్పుకొచ్చారు. తప్పతాగి ఉన్న ఇద్దరు వ్యక్తులు మాత్రమే తనపై అరిచారని, మిగతా వారందరూ తన వద్దకు వచ్చి మంచి జరగాలని కోరుకున్నట్టు పేర్కొన్నారు. ఆరోప‌ణ‌ల నుంచి బ‌య‌ట‌పడేందుకు త‌గిన ఆధారాలు ఉన్నాయ‌ని తెలిపారు. కాగా, మాల్యా కేసు విచారణ సందర్భంగా ఆయన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా కూడా కోర్టుకు హాజరయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News