మ‌ల‌యాళీలూ..ఈ గ్లోరిఫై ఏంటండీ?

Update: 2020-04-15 03:30 GMT
ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా వ్యాప్తి - విశ్వ‌వ్యాప్తంగా జ‌నం తీవ్ర భ‌యాందోళ‌న‌ల్లో కూరుకుపోయిన వేళ‌... క‌రోనా క‌ట్ట‌డి కోసం కేర‌ళ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ఆ రాష్ట్రానికి చెందిన ప్ర‌జ‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు - చేస్తున్న ప్ర‌చారం... కేర‌ళ స‌ర్కారును ఆకాశానికెత్తేసిన‌ట్టుగానే భావించ‌క త‌ప్ప‌దు. కేర‌ళ‌లో క‌రోనాకు సంబంధించి వ‌రుస‌గా చోటుచేసుకున్న‌ - చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌ను కాస్తంత లోతుగా ప‌రిశీలిస్తే.. ఈ భావ‌న క‌రెక్టేన‌ని ఎవ‌రైనా ఇట్టే ఒప్పేసుకోక త‌ప్ప‌దు. మొత్తంగా కరోనాపై పోరులో ప్ర‌పంచంలోని అన్ని దేశాలు తీసుకుంటున్న చ‌ర్య‌లు ఒక‌ర‌కంగా ఉంటే.. వాట‌న్నింటి కంటే కూడా కేర‌ళ స‌ర్కారు తీసుకుంటున్న నిర్ణ‌యాలు - క‌రోనా క‌ట్ట‌డి చర్య‌లు భేషుగ్గా ఉన్నాయంటున్న రీతిలో మ‌ల‌యాళీలు చేస్తున్న ప్ర‌చారం నిజంగానే కాస్తంత విడ్డూరంగానే అనిపించ‌క మాన‌దు. మొత్తంగా క‌రోనా విల‌యంలో కేర‌ళ స‌ర్కారును - ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ ను మ‌ల‌యాళీలు ఆకాశానికెత్తుతున్న తీరు చూస్తుంటే... విల‌యాన్ని కూడా త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకుంటున్న వైనం నిజంగానే ఆస‌క్తి రేకెత్తిస్తోంద‌ని చెప్పాలి.

ఈ దిశ‌గా కేర‌ళ‌లో క‌రోనా విల‌యాన్ని మ‌ల‌యాళీలు తమ రాష్ట్రాన్ని ఎలా గ్లోరిఫై చేసుకుంటున్నార‌న్న విష‌యంలో వెళ్లిపోదాం పదండి. ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికించేస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి... భార‌త్ లోకి ఎంట్రీ ఇచ్చిందే కేర‌ళ నుంచే. భార‌త్ లో తొలి క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది కేర‌ళలోనే. కరోనా పుట్టిన చైనాలోని వూహాన్ న‌గ‌రం నుంచి కేర‌ళకు వ‌చ్చిన ఓ మ‌ల‌యాళీ విద్యార్థికి ఈ వైర‌స్ సోకింది. అది ఎప్పుడంటే.. జ‌న‌వ‌రి 30న‌. జ‌న‌వ‌రి 30 కంటే ముందుగానే అటు వూహాన్ లోనే కాకుండా చాలా దేశాల్లో క‌రోనా పాజిటివ్ కేసులున్నాయి. వూహాన్ లో క‌రోనా రోగుల కోసం ఏకంగా ఓ భారీ ఆస్ప‌త్రిని యుద్ధ‌ప్రాతిప‌దిక‌న నిర్మించిన వైనం కూడా మ‌న‌కు తెలిసిందే. అయితే కేర‌ళ‌లో జ‌న‌వ‌రి 30న తొలి పాజిటివ్ కేసు న‌మోదైతే... జ‌న‌వ‌రి 24 నాటికే కేర‌ళ‌లో ఏకంగా ఐసోలేష‌న్ వార్డులు కూడా సిద్ధంగా ఉన్న‌ట్లుగా మ‌ల‌యాళీలు చెబుతున్నారు. అంతేకాదండోయ్‌... ఐసోలేష‌న్ వార్డులు సిద్ధం కాకుండానే, అస‌లు క‌రోనా పాజిటివ్ న‌మోదు కాకుండానే కేర‌ళ ఆరోగ్య శాఖ మంత్రి జ‌న‌వ‌రి 22 నుంచే త‌న అధికారిక పేజీలో క‌రోనాకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వ‌డం మొద‌లెట్టేశార‌ని కూడా మ‌ల‌యాళీలు చెబుతున్నారు.

ఇక త‌ద‌నంత‌ర ప‌రిస్థితుల గురించిన వివ‌రాల్లోకి వెళితే... జ‌న‌వ‌రి 30న కేర‌ళ‌లో తొలి పాజిటివ్ కేసు న‌మోదు కాగా... ఆ త‌ర్వాత మ‌రో ఇద్ద‌రు కూడా ఈ వైర‌స్ బారిన ప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఫిబ్ర‌వ‌రి 4న రాష్ట్రంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ప్ర‌క‌టించిన కేర‌ళ స‌ర్కారు... ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని ప్ర‌క‌టించింద‌ట‌. అంతేనా... క్వారంటైన్ కే 14 రోజులు ప‌డుతుండ‌గా... క‌రోనా సోకిన ముగ్గురికి చికిత్స‌లు అందించిన కేర‌ళ స‌ర్కారు... వారికి ప‌ది రోజుల కంటే త‌క్కువ వ్య‌వ‌ధిలోనే వైర‌స్ నుంచి విముక్తి క‌ల్పించి ఫిబ్ర‌వ‌రి 14న డిశ్చార్జీ చేసింద‌ట‌. అంతేనా... వైర‌స్ కు సంబంధించి సెకండ‌రీ స్ప్రెడ్ లేక‌పోవ‌డంతో క్వారంటైన్ ను బాగా త‌గ్గించేశార‌ట‌. అయినా కూడా విమానాశ్ర‌యాల్లో విదేశాల నుంచి వ‌చ్చిన వారికి స్క్రీనింగ్ కూడా మొద‌లెట్టేశార‌ట‌. అప్ప‌టి నుంచి ఫిబ్ర‌వ‌రిలో సింగిల్ కేసు లేక‌పోగా... మార్చి 8న కొత్త‌గా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ట‌. ఈ క్ర‌మంలో మార్చి 10న పబ్లిక్ ఈవెంట్స్ ను ర‌ద్దు చేసిన కేర‌ళ స‌ర్కారు... 11న పాఠ‌శాల‌లు - కళాశాల‌లు - సినిమా థియేట‌ర్ల‌ను మూసివేసిందట‌.

ఇక మార్చి 12న క‌రోనాపై మొబైల్ యాప్ ను విడుద‌ల చేసిన పిన‌ర‌యి స‌ర్కారు... అదే రోజున ప‌సిపిల్ల‌లు ఆక‌లితో ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేందుకు ఇళ్ల‌కే మ‌ధ్యాహ్న భోజనాన్ని పంపే ఏర్పాట్ల‌ను ప్ర‌క‌టించింద‌ట‌.ఇక మార్చి 16న బ్రేక్ ద చెయిన్ అంటూ క‌రోనా వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేసేందుకు ఓ పెద్ద యుద్ధాన్నే ప్రారంభించింద‌ట‌. అది కూడా విప‌క్షంతో క‌లిసి సంయుక్తంగా ఈ కార్య‌క్ర‌మాన్ని మొద‌లెట్టేసింద‌ట‌. అప్ప‌టిదాకా రోజూ కోవిడ్ వివ‌రాల‌ను వెల్ల‌డించేందుకు రోజూ ఆరోగ్య శాఖ మంత్రి మీడియా ముందుకు వ‌స్తుంటే.. ఇక ఆ త‌ర్వాత ఏకంగా ముఖ్య‌మంత్రి హోదాలో పిన‌ర‌యి విజ‌య‌న్ నేరుగా మీడియా స‌మావేశాల‌కు వ‌స్తున్నార‌ని - క‌రోనా వ్యాప్తిని నిరోధించాల్సిన అవ‌స‌రం - వైర‌స్ వ‌ల్ల జ‌రిగే న‌ష్టంతో పాటు వైర‌స్ వ్యాప్తికి సంబంధించిన అప్ డేట్స్ ను స్వ‌యంగా విజ‌య‌నే వెల్ల‌డించ‌డం ప్రారంభించార‌ట‌. అంటే... కేంద్రం ప్ర‌క‌టించిన లాక్ డౌన్ కంటే ముందే కేరళ స‌ర్కారు... క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు అవ‌స‌ర‌మైన అన్ని చర్య‌ల‌ను తీసుకున్న‌ద‌ని మ‌ల‌యాళీలు ప్ర‌చారం చేశారు. అయినా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాక‌ముందే... కేర‌ళ‌లో ఐసోలేష‌న్ వార్డులు ఏర్పాట‌య్యాయంటూ మ‌ల‌యాళీలు చెప్పుకుంటున్న తీరు... ఆ రాష్ట్రం ప‌రువును గంగ‌లో క‌లిపేశాయ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

   

Tags:    

Similar News