స్పీక‌ర్ క‌ళ్ల‌ద్దాలు యాభైవేలు..స‌ర్కారు చెల్లింపు

Update: 2018-02-04 04:34 GMT
అధికార దుర్వినియోగం అనే అంశంలో అనూహ్య‌మైన వార్త తెర‌మీద‌కు వచ్చింది. అది కూడా ఆద‌ర్శ‌రాష్ట్రంగా ప్ర‌చారం చేసుకునే కేర‌ళ నుంచి వెలువ‌డటం సంచ‌ల‌నం సృష్టించింది. ఇటీవలే కేరళ వైద్యారోగ్యశాఖ మంత్రి కేకే శైలజ సైతం రూ.28వేల ఖరీదైన కళ్ల‌ద్దాలు కొనుగోలు చేసి - రాష్ట్ర ఖజానా నుంచి రీయింబర్స్‌ మెంట్ పొందడం వివాదానికి తెరలేపింది. భర్త పేరుతో శైలజ నకిలీ బిల్లులు పెట్టి వైద్య బిల్లుల రీయింబర్స్‌ మెంట్‌ కు దరఖాస్తు చేశారనే వార్త‌లు క‌ల‌క‌లం రేకెత్తించాయి.

అయితే దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా...మ‌రో వివాదం అదే రాష్ట్రం నుంచి...అదే త‌ర‌హాలో తెర‌మీద‌కు వ‌చ్చింది. కేరళ అసెంబ్లీ స్పీకర్ పీ శ్రీరామకృష్ణన్ రూ.50 వేల విలువైన కళ్ల‌ద్దాలను ధరించడం వివాదాస్పదమైంది. అయితే అది సొంతడబ్బుతో కొనుక్కుంటే అంతగా బయటకు తెలిసేది కాదేమో! రూ.50వేల మొత్తాన్ని రాష్ట్ర ఖజానా నుంచి రీయింబర్స్‌ మెంట్ పొందడమే వివాదానికి కారణమైంది. స‌హ‌జంగానే రాజ‌కీయ రూపును సంత‌రించుకుంది.

కొచ్చికి చెందిన అడ్వొకేట్ డీబీ బిను సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేసి పొందిన వివ‌రాలు తాజాగా క‌ల‌క‌లం రేకెత్తిస్తున్నాయి. స్పీకర్ కళ్ల‌ద్దాల కోసం రూ.49,900 (రూ.4,900 కళ్ల‌ద్దాలకు - రూ.45వేలు ఫ్రేమ్‌ కు) ఖర్చు చేశారని పేర్కొంటూ శాసనసభ సచివాలయం సమాధానం ఇచ్చింది. 2016 అక్టోబర్ 5 నుంచి ఈ ఏడాది జనవరి 19వ తేదీ వరకు స్పీకర్ రూ.4.25 లక్షల మెడికల్ రీయింబర్స్‌ మెంట్ పొందారని పేర్కొంది. దీంతో ఈ ప‌రిణామం వివాదానికి దారితీసింది. కాగా, ఈ వివాదంపై స్పీకర్ స్పందిస్తూ.. వైద్యుడి సూచన మేరకే కళ్ల‌ద్దాలు కొనుగోలు చేశానని చెప్పారు. మ‌రోవైపు ఈ త‌ర‌హాలో నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు జరపాల‌ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సురేంద్రన్ డిమాండ్ చేశారు.
Tags:    

Similar News