విజ‌య‌వాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్య‌ర్థిగా కేశినేని నాని?

Update: 2022-07-23 04:21 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థిగా వైఎస్సార్సీపీ త‌ర‌ఫున కేశినేని నాని పోటీ చేస్తార‌ని నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ జ‌రుగుతోంది. కేశినేని నాని 2014, 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున వ‌రుస‌గా రెండుసార్లు విజ‌య‌వాడ ఎంపీగా గెలుపొందారు.

అయితే గ‌త కొంత‌కాలంగా టీడీపీ అధిష్టానాన్ని ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. త‌న‌ను పార్టీలోంచి పొమ్మ‌న‌కుండా పొగ‌బెట్టే వ్య‌వ‌హారాల‌కు పాల్ప‌డుతున్నార‌ని సోష‌ల్ మీడియాలో కేశినేని నాని ధ్వ‌జ‌మెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. సొంత పార్టీలోనే త‌న‌పై నేత‌ల‌ను ఎగ‌దోస్తున్నార‌నేది నాని అభియోగంగా ఉంది. అలాగే తాను వైఎస్సార్సీపీలో చేరుతున్నా అని, బీజేపీలో చేరుతున్నా అని త‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని కేశినేని నాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రోవైపు త‌న సొంత కుటుంబంలోనే చిచ్చుపెట్టి త‌న సోద‌రుడు కేశినేని చిన్నిని త‌న‌పైకి ఎగ‌దోయ‌డం, చిన్నికి అన్ని విధాలా టీడీపీ అధిష్టానం అండ‌దండ‌లు అందించ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా కేశినేని చిన్నినే పోటీ చేస్తార‌ని లీకులిస్తుండ‌టం వంటికి కేశినేని నానిని ఆవేద‌న‌కు గురి చేశాయ‌ని చెబుతున్నారు. పార్టీకి చెడ్డ‌పేరు రాకూడ‌ద‌నే త‌న ట్రావెల్ బిజినెస్, ఇతర వ్యాపారాల‌ను సైతం తాను మానుకున్నాన‌ని.. కానీ టీడీపీ అధిష్టానం త‌న‌ను దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రించ‌డం ఏమిట‌ని స‌న్నిహితుల వ‌ద్ద నాని ఆవేదన వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది.

గ‌త అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన అసెంబ్లీ అభ్య‌ర్థుల‌కు ఖ‌ర్చంతా తానే పెట్టుకున్నాన‌న‌ని.. పార్టీకి తాను ఇంత చేస్తే పార్టీ త‌న‌కేమీ ఇచ్చింద‌ని ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో త‌న‌ను ఇంత‌గా వేధించి, అవ‌మానించిన టీడీపీకి బుద్ధి చెప్పాల‌ని కేశినేని నిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున కేవినేని పోటీ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే వైఎస్సార్సీపీ కీల‌క నేత‌లు కేశినేని నానితో చ‌ర్చ‌లు కూడా జ‌రుపుతున్నార‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు విజ‌య‌వాడ‌లో పార్ల‌మెంటుకు పోటీ చేయ‌డానికి వైఎస్సార్సీపీకి గ‌ట్టి అభ్య‌ర్థి లేడు. 2014లో కోనేరు రాజేంద్ర ప్ర‌సాద్, 2019లో ప్ర‌ముఖ నిర్మాత పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ పోటీ చేశారు. ఇద్ద‌రూ ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ప్ప వీరిద్ద‌రూ మ‌ళ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ, పార్టీ స‌మావేశాల్లోనూ క‌నిపించింది లేద‌ని చెబుతున్నారు. స్థానికంగానూ వీరిద్ద‌రూ నివాసం ఉండ‌టం లేద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో కేశినేని నానిని వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించి ఆయ‌న‌ను విజ‌య‌వాడ నుంచి లోక్ స‌భ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాల‌ని అనుకుంటున్నార‌ని స‌మాచారం. కేశినేని నాని పోటీకి సిద్ధంగా లేక‌పోతే ఆయ‌న కుమార్తె, ప్ర‌స్తుతం కార్పొరేట‌ర్ గా ఉన్న కేశినేని శ్వేత‌ను బ‌రిలోకి దించుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
Tags:    

Similar News