ఈ ఎంపీని ప‌వ‌న్ ఎంతో ప్రేమిస్తార‌ట‌

Update: 2017-01-16 05:14 GMT
విమ‌ర్శ‌ల‌ను సైతం సానుకూలంగా తీసుకోవ‌డమే కాదు దానికి కొత్త భాష్యం చెప్ప‌డంలో రాజ‌కీయ నాయ‌కులను మించిన‌వారు ఉండ‌ర‌నేందుకు మ‌రో ఉదాహ‌ర‌ణ ఇది. జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ఆకాంక్షాల కోణం విమ‌ర్శ‌లు చేస్తే తెలుగుదేశం పార్టీ విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని దానికి అనూహ్య‌మైన ట్విస్ట్ ఇచ్చారు. 2014 ఎన్నిక‌ల్లో త‌మ‌కు స‌హ‌క‌రించి గెలిపించిన ప‌వ‌ర్ స్టార్ దుమ్మెత్తిపోసిన‌ప్ప‌టికీ అవ‌న్నీ ప్రేమ పూర్వ‌క వ్యాఖ్య‌లేన‌ని త‌మ‌కు తాముగా స‌ర్దిచెప్పుకుంటున్నారు. తాజాగా  ఓ ఇంటర్వ్యూలో  విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని  మాట్లాడుతూ  ప‌వ‌ర్ స్టార్  పవన్ కళ్యాణ్‌ కు తన పైన ద్వేషం లేదని - ఎంతో ప్రేమ ఉందని తెలిపారు. అలాంట‌పుడు గ‌తంలో ప‌వ‌న్  ఆంధ్రా ఎంపీలకు ఇంగ్లీషు రాదని - అందుకే హోదా గురించి అడగలేకపోతున్నారని అందులో ముఖ్యంగా మిమ్మ‌ల్ని టార్గెట్ చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని స‌ద‌రు పాత్రికేయుడు ప్ర‌శ్నించ‌గా... ప్రేమ ఎక్కువైనా అలాగే ఉంటుంద‌ని కేశినేని నాని కొత్త భాష్యం చెప్పారు. అయినా త‌న‌కు హిందీ - ఇంగ్లీష్ వస్తుంద‌ని నాని వివ‌రించారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ భిన్న‌మైన రాజ‌కీయ‌వేత్త అని పేర్కొంటూ ఆయ‌న మంచి రాజ‌కీయ నాయ‌కుల‌కే మ‌ద్ద‌తిస్తుంటార‌ని కేశినేని నాని తెలిపారు. టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు మంచి నాయ‌కుడు కాబ‌ట్టే ప‌వ‌న్ క‌ళ్యాణ్ 2014లో మ‌ద్ద‌తిచ్చార‌ని నాని చెప్పారు. భ‌విష్య‌త్ లోనూ అదే రీతిలో చేస్తార‌ని విశ్లేషించారు. కాగా ఇప్ప‌టివ‌ర‌కు తాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో మాట్లాడ‌లేద‌ని ఈ  ఇంట‌ర్వ్యూలో కేశినేని నాని తెలిపారు. ఆయ‌న సోద‌రుడు చిరంజీవితో మాత్రం ప‌రిచ‌యం ఉంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. కాగా గ‌తంలో ప‌వ‌న్ కామెంట్ల‌పై ఘాటుగా రియాక్ట‌యిన కేశినేని నాని ఇపుడు టోన్ చేంజ్ చేయ‌డం వెనుక కార‌ణాలు ఏంట‌ని పలువురు ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల దూకుడుగా ముందుకుపోవ‌డం, వివిధ ప్ర‌జాసమ‌స్య‌ల‌పై ఆయ‌న స్పందించిన వెంట‌నే సీఎం చంద్ర‌బాబు వాటిని ప‌రిష్క‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పార్టీ అధినేత ప‌వ‌న్‌ ను త‌న ద‌గ్గ‌రి వాడుగా చూస్తున్న‌పుడు తానెందుకు దూరం చేసుకోవాల‌నే కోణంలో నాని కామెంట్లు ఉన్నాయ‌ని చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News