కేశినేని నాని మరో కలకలం

Update: 2019-07-07 05:57 GMT
విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని టీడీపీలో కలకలం రేపే చర్యలకు పాల్పడుతున్నారు. అధినేత చంద్రబాబును సంప్రదించకుండానే తనంతట తానుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం ఇప్పుడా పార్టీలో కాకరేపుతోంది.

కేశినేని నాని తాజాగా చంద్రబాబుపై, టీడీపీ పార్టీ తీరుపై సోషల్ మీడియా ద్వారా తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్న సంగతి తెలిసిందే.. మాజీ మంత్రి దేవినేని -తోటి టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్ - రామ్మోహన్ నాయుడులకు బాబు అందలం ఎక్కివ్వడాన్ని జీర్ణించుకోలేని నాని కొద్దిరోజులుగా సోషల్ మీడియా సాక్షిగా తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబును ఇరుకునపెడుతున్నారు.

తాజాగా చంద్రబాబుకు - టీడీపీ అధిష్టానానికి చెప్పకుండానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని ఎంపీ కేశినేని నాని పెట్టడం సంచలనమైంది. ఈ మీటింగ్ కు నియోజకవర్గ కార్పొరేటర్లు - నాయకులు - మాజీ కార్పొరేటర్లు సహా అందరూ వచ్చేశారు. ఇక్కడే తనకు అత్యంత ఆప్తుడైన మైనార్టీ టీడీపీ నేత ‘నాగుల్ మీరా’ను వచ్చేసారి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీచేస్తారని నాని ప్రకటించేశారు. ఇప్పుడిదే ఆ పార్టీలో దుమారం రేపుతోంది.

విజయవాడ పశ్చిమలో ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ. ఇక్కడ 12 సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు మైనార్టీలు గెలిచారు. 2014లో టీడీపీ నుంచి జలీల్ ఖాన్ గెలిచారు. 2019లో ఆయన కూతురు షబానా పోటీచేసి ఓడిపోయారు. ఇక ఇదే నియోజకవర్గంలో టీడీపీకి అన్నీ తానై వ్యవహరిస్తున్న విజయవాడ నగర టీడీపీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న కూడా ‘నాగుల్ మీరా’ను ఎమ్మెల్యేగా ప్రకటించిన ఎంపీ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమను సంప్రదించకుండా అభ్యర్థిని ప్రకటించడంపై ఇప్పుడు గుర్రుగా ఉన్నారు. కొందరు రాజీనామాలకు సిద్ధపడ్డారు. ఇప్పుడు ఎంపీ వ్యవహారశైలి టీడీపీలో మరో దుమారానికి కారణమైంది.
Tags:    

Similar News