వాహనాల బాధ్యత అంతా ఆ ఎంపీదేనంట

Update: 2015-10-21 11:40 GMT
అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా పనులను దాదాపుగా పూర్తి చేసింది. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యే అతిధులకు ఖరీదైన వాహనాల్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే.. దీనికి సంబంధించి వాహనాల్ని ఎంపిక చేయటం.. వాటికి సంబంధించి అంశాల్ని మాట్లాడే బాధ్యతను విజయవాడ ఎంపీ కేశినేని నానికి అప్పజెప్పినట్లుగా చెబుతున్నారు. కేశినేని బస్సుల యజమానిగా వాహనరంగంలో ఆయనకు ఉన్న అనుభవంతో పాటు.. ఎవరి దగ్గర ఎలాంటి వాహనాలు ఉన్నాయి? వాటి ప్రత్యేకత ఏమిటి? లాంటి అంశాలన్నీ కేశినేని నానికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెబుతారు.

దేశ వ్యాప్తంగా ఖరీదైన బస్సుల వివరాలు కేశినేని నానికి నోటి మీదనే ఉంటాయని.. దీనికి తోడు కార్ల విషయంలోనూ ఆయనకున్న అవగాహన చాలా ఎక్కువని చెబుతారు. అందుకే.. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే అతిదులకు అవసరమైన ఖరీదైన కార్లను ఒకచోటకు చేర్చే బాధ్యతను కేశినేని నానికి అప్పజెప్పారు. అంతేకాదు.. బస్సులను తెప్పించే బాధ్యత కూడా ఆయనదేదనట. ఈ కారణంతోనే రజనీకాంత్ వ్యక్తిగతంగా వినియోగించే రెండు ఖరీదైన బస్సుల సమాచారం ఆయనకు తెలిసే.. వాటిని తెప్పించినట్లు తెలుస్తోంది. వీవీఐపీలకు కార్లలో శంకుస్థాపన కార్యక్రమం జరిగే ప్రదేశానికి తీసుకెళ్లటం.. ఒక మోస్తరు వీవీఐపీలను సమూహంగా విలాసవంతమైన బస్సుల్లో శంకుస్థాపన కార్యక్రమం వద్దకు చేర్చాలని భావిస్తున్నారు. ఇందుకోసం.. బస్సుల ఎంపికలో అత్యున్నత ప్రమాణాలు పాటించటంతో పాటు.. లగ్జరీ కార్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉండే బస్సులను ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో బస్సులు.. వాహనాలు.. ప్రత్యేక ఆకర్షణగా మారటం ఖాయమంటున్నారు.
Tags:    

Similar News