తొడ‌గొడితే.. నేత‌లు కాలేరు.. సంచ‌ల‌న రేపుతున్న టీడీపీ ఎంపీ ట్వీట్‌!

Update: 2022-09-29 02:30 GMT
ఒక‌వైపు పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. అధికార పార్టీ వైసీపీ దూకుడు నుంచి.. పోలీసుల కేసుల నుంచి.. అసెంబ్లీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల గురించి.. ఇలా అనేక రూపాల్లో పార్టీ త‌న‌ను తాను ర‌క్షించుకుని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో నాయ‌కులు అంద‌రూ కూడా.. క‌ల‌సి క‌ట్టుగా ముందుకు సాగాల‌ని.. పార్టీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. కానీ, నాయ‌కులు కొంద‌రు ఆయ‌న మాట వింటుంటే.. మ‌రికొంద‌రు మాత్రం.. ఎవరి మానాన వారు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ముఖ్యంగా విజ‌య‌వాడ టీడీపీలో  కొన్నాళ్లుగా.. పంటికింద రాయిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఎంపీ.. కేశినేని.. నాని వ్య‌వ‌హార శైలి ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేద‌ని అంటున్నారు. ఆయ‌న పార్టీలో ఉంటారు.. పార్టీలోనే ఉంటాన‌ని.. చెబుతారు. కానీ, సైకిల్ చ‌క్రాల‌కు .. నెమ్మ‌ది నెమ్మ‌దిగా గాలి తీసే ప‌నిని విడ‌త‌ల వారీగా చేస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేత‌ల‌నే ఆయ‌న టార్గెట్ చేస్తున్నారు. ఎవ‌రైనా ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను టార్గెట్ చేస్తారు. కానీ, నాని మాత్రం త‌న పార్టీలోని కీల‌క నాయ‌కుల‌ను టార్గెట్ చేస్తున్నారు. వారిపై ప‌దునైన వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

గ‌తంలో అప్ప‌టి ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌పై కొబ్బ‌రి చిప్ప‌లు, బెల్లుల దొంగ అంటూ విరుచుకుప‌డ్డారు. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమాను టార్గెట్ చేసిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ``ఎక్క‌డో తొడ‌గొట్టినంత మాత్రాన నేత‌లు కాలేరు. మీడియా నుంచి నాయ‌కులు పుట్ట‌లేరు. ప్ర‌జ‌ల నుంచి నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తారు. పార్టీకోసం నిస్వార్థంగా ప‌నిచేసేవారికి ప్రాధాన్యం ఉంటుంది. క‌మ‌ర్సియ‌ల్ నేత‌లను అంగీక‌రించే ప్ర‌స‌క్తే లేదు`` అని ఎంపీ నాని ట్వీట్ చేశారు.

మ‌రి ఈ వ్యాఖ్య‌లు సొంత పార్టీ నేత‌ల‌ను ఉద్దేశించే ఆయ‌న చేశారు. మ‌రి ఇలా చేయ‌డం ద్వారా.. ఆయ‌న పార్టీ ప‌రువును తీస్తున్నారా?  పెంచుతున్నారా? అని సీనియ‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌స్తుత స‌మ‌యంలో అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ముందుకు సాగాల‌ని అధినేత కోరుతుంటే.. ఇలా.. పుల్ల‌లు పెట్టే విధానం ఏంట‌ని మండిప‌డుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News