ఎంపీ నాని అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా

Update: 2017-05-24 04:20 GMT
అధినేత మీద ఎంపీ నానికి అప‌రిమిత‌మైన న‌మ్మ‌కం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. తానేం మాట్లాడినా.. ఘాటు చ‌ర్య‌ల‌కు బాబు దిగ‌ర‌న్న న‌మ్మ‌క‌మో ఏమో కానీ.. కఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న మాట బాబు నోటి నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ నాని మాత్రం వెన‌క్కి త‌గ్గ‌టం లేదు.

మిత్ర‌ధ‌ర్మాన్ని తుంగ‌లోకి తొక్కిన‌ట్లుగా మాట్లాడేస్తున్న తెలుగు త‌మ్ముళ్ల‌కు ఎంపీ నాని ఆద్యుడ‌ని చెప్పాలి. కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ అవ‌స‌రం లేకున్నా సంకీర్ణ స‌ర్కారు సాగుతున్న విష‌యం తెలిసిందే. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. బీజేపీతో చేసుకున్న స్నేహ‌పూర్వ‌క ఒప్పందంతో క‌లిసి పోటీ చేయ‌టం.. ఎన్నిక‌ల త‌ర్వాత వ‌చ్చిన ఫ‌లితాలు ఇరువురికి ఉప‌యోగ‌క‌రంగా లేన‌ప్ప‌టికీ.. క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖ‌మ‌న్న‌ట్లుగా అటు కేంద్రంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు.

అధినాయ‌క‌త్వం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నా.. మిగిలిన నేత‌ల నోటి నుంచి వ‌స్తున్న వ్యాఖ్య‌లు ఇరు పార్టీల అధినాయ‌క‌త్వానికి చిరాకుగా మారింది. మొన్న‌టికి మొన్న విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు లేకుంటే తాను మూడు ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో గెలిచి ఉండేవాడిన‌న్న వ్యాఖ్య చేయ‌టంపై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. స్నేహితుడిగా ఉంటూనే ఇలా మాట‌ల‌తో అవ‌మానిస్తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు.
మ‌రోవైపు.. అనుచిత వ్యాఖ్య‌ల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు చంద్ర‌బాబు. త‌మ పార్టీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్య‌లు చేసే వారి విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని స్ప‌ష్టం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఆ మాట‌లు అస్స‌లు ప‌ట్ట‌న‌ట్లుగా కేశినేని తాజాగా వ్య‌వ‌హ‌రించిన తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎందుకంటే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన నాని మాత్రం త‌న మాట‌ల‌పై వ‌స్తున్న రియాక్ష‌న్ ఏమీ ప‌ట్టించుకోకుండా త‌న వ్యాఖ్య‌ల ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తున్నారు. నాని వ్యాఖ్య‌ల్ని బీజేపీ నేత‌లు తీవ్రంగా ఖండిస్తున్న వేళ‌.. మీరు చేసిన వ్యాఖ్య‌లు వ్య‌క్తిగ‌త‌మైన‌వా? అన్న క్వ‌శ్చ‌న్ వేయ‌గా.. నాని రియాక్ట్ అవుతూ.. తాను ఎంపీన‌ని.. తాను చేసిన వ్యాఖ్య‌లు వ్య‌క్తిగ‌త‌మో.. పార్టీవో మీడియా వాళ్లే డిసైడ్ చేయాలంటూ బ‌దులిచ్చారు. నాని మాట‌లు విన్న‌ప్పుడు అనిపించేది ఒక్క‌టే.. "నాని అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా" అని.
Tags:    

Similar News