కేసీఆర్ హెచ్చరించినా వినట్లేదు.. టీఆర్ఎస్ నేతల ఫైట్

Update: 2020-07-09 03:55 GMT
తెలంగాణ అంతటా క్లీన్ స్వీప్ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో మాత్రం బొక్కా బోర్లా పడింది. కనీసం మంత్రి పదవి ఇవ్వడానికి కూడా సరైన సీనియర్ లేని పరిస్థితికి దిగజారింది. గెలిచిన ఏకైక ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కు మంత్రి పదవీ యోగం దక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిపత్యం, సెగలు, ప్రతీకారాలతో టీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలవలేకపోయింది. ఇంత దెబ్బతిన్నా కానీ ఇప్పటికీ ఖమ్మం గులాబీ నేతలు ముఠా గొడవలతో రచ్చ చేసుకుంటుండడం అధిష్టానానికి ఆగ్రహం తెప్పిస్తోంది.

ఖమ్మం పూర్వపు జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గంలోని టీఆర్ఎస్ లో నాయకులు కత్తులు దూసుకుంటున్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు మధ్య పచ్చగడ్డి వేసినా వేయకున్న భగ్గుమంటోంది. కోల్డ్ వార్ పతాక స్థాయికి చేరిందట..

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన వనమా వెంకటేశ్వరరావు అనంతరం టీఆర్ఎస్ లో చేరిపోయారు. టీఆర్ఎస్ తరుఫున పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఓడిపోయారు. దీంతో ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేక విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్ పర్యటనలో జలగం వర్గీయుల ఫ్లెక్సీలు తొలగించడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే వర్గమే ఈ పనిచేసిందని జలగం వర్గం పెద్ద రాద్ధాంతం చేసింది. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టి తిట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో కొత్తగూడెం పంచాయితీ అధిష్టానానికి చేరింది. ఇప్పటికే ఖమ్మంలో గ్రూపు తగాదాల వల్లే ఓడామని కేసీఆర్ హెచ్చరించినా నేతలు మారకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News