రాహుల్ బ్యాటింగ్ షో.. బెంగళూరు చిత్తు!

Update: 2020-09-25 04:15 GMT
పంజాబ్‌ కెప్టెన్, డాషింగ్‌ ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 13 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఏ భారత ఆటగాడికి సాధ్యం కానీ అత్యధిక స్కోరును సాధించాడు.  రాహుల్ ఎడా పెడా  సిక్స్‌లు, ఫోర్లు బాదడంతో బెంగళూరు బౌలింగ్‌ దళం బెంబేలెత్తింది. రాహుల్ విధ్వంసంతో పంజాబ్ 97 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్ ఒడి  ముందుగా  బ్యాటింగ్ చేసిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్, 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' లోకేశ్‌ రాహుల్‌ (69 బంతుల్లో 132 నాటౌట్‌; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) బౌండరీలతో  చెలరేగాడు.  మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (26) కూడా రాణించాడు.  భారీ లక్ష్యఛేదనకు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 17 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఏ దశలోనూ పోటీలోకి రాలేదు. వాషింగ్టన్‌ సుందర్‌ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌.  తొలి ఓవర్లో పాడిక్కల్‌ (1), రెండో ఓవర్లోనే ఫిలిప్‌ (0), మూడో ఓవర్లో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కోహ్లి (1) ఔటయ్యారు. కాట్రెల్‌ దెబ్బకు 4 పరుగులకే 3 టాప్‌ వికెట్లను కోల్పోవడంతో ఆర్‌సీబీ పరాజయం వైపు మళ్లింది. రవి బిష్ణోయ్‌ అద్భుతమైన డెలివరీకి ఫించ్‌ (21 బంతుల్లో 20; 3 ఫోర్లు) బౌల్డ్‌ కాగా, ఆపై డివిలియర్స్‌ (18 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్‌) వల్లా కాలేదు. పంజాబ్ బౌలర్లు  బిష్ణోయ్, మురుగన్ అశ్విన్ చెరో మూడు వికెట్లు ట్ల  తీయడంతో  బెంగళూరు 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది.


పలు రికార్డులు బద్ధలు కొట్టిన రాహుల్

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు

ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్‌ లో అత్యధిక పరుగులు (132) చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌ గా రికార్డు బద్దలు కొట్టాడు.  ఐపీఎల్ 2020లో తొలి సెంచరీ నమోదు చేశాడు. గతంలో రిషభ్‌ పంత్‌ (128 నాటౌట్‌) పేరిట ఈ ఘనత ఉంది. లీగ్‌లో కెప్టెన్‌ గా అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడి గా కూడా రాహుల్‌ నిలిచాడు.

ఐపీఎల్ లో అత్యధిక వేగంగా 2 వేల పరుగులు

ఐపీఎల్‌లో అత్యధిక వేగంగా 2 వేల పరుగులు  సాధించిన భారత బ్యాట్స్ మెన్ గా రాహుల్ రికార్డు నెలకొల్పాడు. సచిన్ నెలకొల్పిన రికార్డ్‌ని రాహుల్  బ్రేక్ చేశాడు.
సచిన్ టెండూల్కర్ 63 ఇన్నింగ్స్‌లతో  2 వేల పరుగులు సాధించగా రాహుల్ 59 ఇన్నింగ్స్‌లోనే  అత్యధిక పరుగుల రికార్డు అందుకున్నాడు.

కోహ్లి మిస్సింగ్స్‌
మైదానంలో చురుగ్గా ఉండే  ఆర్‌సీబీ కెప్టెన్‌ కోహ్లి మిస్‌ ఫీల్డింగ్‌ విస్మయపరిచింది. ఈ చురుకైన ఫీల్డర్‌ ... వరుస ఓవర్లలో రాహుల్‌ ఇచ్చిన రెండు సులువైన క్యాచ్‌లను నేలపాలు చేశాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పంజాబ్ కెప్టెన్ పరుగుల వరద పారించాడు.

మ్యాచ్ లో హైలైట్స్

* బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో మ్యాచ్ లోనూ విఫలం అవడం జట్టు ఘోర పరాజయానికి కారణమైంది.

* ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ కు ఇది రెండో సెంచరీ

* ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్లు రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్ తలో మూడు వికెట్లు తీయడం, కాట్రేల్ మొదట్లోనే రెండు వికెట్లు తీయడంతో బెంగళూరు  16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పరాజయం ఖాయం చేసుకుంది.

* తొలి మ్యాచ్ లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న బెంగళూరు ఓపెనర్ పాడిక్కల్ ఒక్క పరుగుకే ఔట్ అయ్యాడు.
Tags:    

Similar News