పీకే ఫ్యామిలీ దేశం విడిచి వెళ్లాలనుకున్నారట

Update: 2015-11-24 04:17 GMT
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తాజాగా సంచలన వ్యాఖ్య చేశారు. రామ్ నాథ్ గోయంకా ఎక్స్ లెన్స్ ఇన్ జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా తన మనసులోని భావాల్ని చెప్పుకొచ్చారు. దేశంలో ఈ మధ్య కాలంలో పెరిగిన అసహనం.. తన కుటుంబం మీద కూడా ప్రభావం చూపించిందని చెప్పుకొచ్చారు. మత అసహనం పెరగటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పిన అమీర్ ఖాన్.. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పలు అంశాలు ఆందోళన కలిగించాయని.. ఒకదశలో తన భార్య కిరణ్ రావ్ సైతం.. దేశం విడిచి వెళదామన్న ప్రతిపాదన చేసిందని వ్యాఖ్యానించారు.

‘‘ఒక వ్యక్తిగా.. ఈ దేశంలో ఒక పౌరుడిగా.. ఏం జరుగుతుందో మనం పత్రికల్లో చదువుతాం. నిజంగా నేను ఆందోళనకు గురయ్యా. దేశంలో కొంతకాలంగా అభద్రతాభావం పెరుగుతోంది’’ అన్న వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తిగా.. దేశంలో ఏం జరుగుతుందన్నది దినపత్రికలు.. ఛానల్స్ చూసి వార్తల ద్వారా తెలుసుకుంటామని.. చాలా సందర్భాల్లో  తాను భయపడినట్లు పేర్కొన్నారు. ఆరేడు నెలలుగా తాను అభద్రతా భావానికి లోనవుతున్నట్లు చెప్పాడు. తమలో భయానికి తోడు కలవరం పెరుగుతోందని.. నిరాశ ఆవరిస్తోందని అమీర్ పేర్కొన్నారు.

రాజకీయ నాయకుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన.. ‘‘మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎవరు? ఐదేళ్ల పాటు మనల్ని పాలించటానికి మనం ఎవరిని ఎన్నుకున్నాం? కేంద్రం కావొచ్చు.. రాష్ట్రం కావొచ్చు.. నాయకులు చట్టాల్ని తమ చేతుల్లోకి తీసుకుంటే వారి విషయం కఠిన వైఖరి తీసుకోవాలని మనం భావిస్తాం. ఘాటైన ప్రకటన చేస్తాం. న్యాయ ప్రక్రియ ప్రారంభిస్తాం. ఇలాంటివి జరగనప్పుడు దేవంలో అభద్రతా భావం ఉందని భావిస్తాం’’ అని చెప్పుకొచ్చాడు. అవార్డులు తిరిగి ఇవ్వటాన్ని ఆయన సమర్థించాడు.

అసహనంపై తన భార్య కిరణ్ రావ్ తనతో.. దేశం విడిచి వేరే దేశానికి వెళదామా? అని అడిగినట్లుగా అమీర్ ఖాన్ వెల్లడించారు. ఆమె ఆలోచనలు.. భయాలు కొడుకు మీదనే ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. చుట్టూ ఉండే వాతావరణం ఎలా ఉంటుందోనన్న భయం ఆమె మాటల్లో కనిపించిందన్నారు. ఖురాన్ ను చేతిలో పట్టుకొని మనుషులను చంపేవాడు.. తాను ఇస్లాంను పాటిస్తున్నాని అనుకోవచ్చని కానీ.. తాను మాత్రం అతడు ఇస్లాంను పాటిస్తున్నాడని. ముస్లిం అని తాను అనుకోవటం లేదన్నారు. అమాయకుల్ని చంపేవాడు ముస్లిం కాదన్న విషయంలో తాను చాలా స్పష్టంగా ఉన్నానని చెబుతున్న అమీర్ ఖాన్.. అసహనం మీద చెప్పిన మాటు.. ఎలాంటి మంటలు పుట్టిస్తాయో?
Tags:    

Similar News