సారీ చెప్పే వ‌ర‌కూ కేసీఆర్ ను వ‌దిలిపెట్ట‌ర‌ట‌!

Update: 2018-03-04 07:02 GMT
ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌న్న ఎపిసోడ్ పై నిన్న‌టికి నిన్న సుదీర్ఘ వివ‌ర‌ణ ఇవ్వ‌టం తెలిసిందే. ప్ర‌ధానిని తాను అన‌లేద‌ని.. తాను అన్న మాట‌ల సీడీలు తెప్పించుకొని మ‌రీ చూశాన‌ని.. అందులో ఎక్క‌డా ప్ర‌ధానిని అగౌర‌వప‌రిచింది లేద‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ యాగీ చేసుకుంటే మీకే వ‌దిలేస్తున్నాన‌ని కూడా చెప్పేశారు.

ఇదిలాఉండ‌గా.. తాజాగా తెలంగాణ బీజేపీఎల్పీ నేత కిష‌న్ రెడ్డి గొంతు విప్పారు. ప్ర‌ధాని మోడీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల్ని ఆయ‌న తీవ్రంగా ఖండించ‌ట‌మే కాదు. త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ చెప్పిల్సిందేన‌ని డిమాండ్ చేశారు. ప్ర‌ధాని మోడీకి సీఎం కేసీఆర్ సారీ చెప్పే వ‌ర‌కూ విడిచిపెట్టేది లేద‌ని స్ప‌ష్టం చేశారు.

కేంద్రం ఇస్తున్న నిధుల‌తో తెలంగాణ స‌ర్కార్ కేసీఆర్ కిట్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టార‌ని.. రాష్ట్రంలో ఏం జ‌రిగింద‌నే అంశంపై బ‌హిరంగ చ‌ర్చ‌కు కేసీఆర్ రాగ‌లరా? అంటూ స‌వాలు విసిరారు.

బీజేపీని అంతం చేస్తామ‌ని చెబుతున్న కేసీఆర్ మాట‌లు వింటే.. ఏనుగుని చూసి కుక్క‌లు మొరుగుతున్న చందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు అవినీతికి మారుపేరుగా కేసీఆర్ నిలిచార‌న్న కిష‌న్ రెడ్డికి.. ఆయ‌న త‌ప్పుల‌న్నీ ఇప్పుడే క‌నిపించ‌టం ఎందుకన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. విమ‌ర్శ‌లు చేసినంత‌నే.. లోపాలు క‌నిపించ‌టం నేత‌ల‌కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదని చెప్ప‌క త‌ప్ప‌దు. మొండోడు రాజుకంటే బ‌ల‌మైనోడ‌ని అంటారు. మ‌రి.. అదే మొండోడు రాజు అయితే..సారీలు చెప్పుడు ఉంటుందంటారా?
Tags:    

Similar News