తండ్రిని దించిన కుట్ర‌లో బాల‌య్య పాత్ర‌..

Update: 2018-04-21 16:22 GMT
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అమలు చేయాలనీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న ఒక్క రోజు ఉపవాసంతో ధర్మ పోరాట దీక్షను చేసిన సంగతి తెలిసిందే. ఈ సభలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ శిఖండీలా, అన్యాయమైన రాజకీయాలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ రాష్ట్ర బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ బీజేపీ శాస‌న‌సభా ప‌క్ష నేత కిష‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బాల‌య్య‌కు సినిమాల‌కు, నిజ జీవితానికి తేడా తెలుస్తున్న‌ట్లు లేద‌ని ఎద్దేవా చేశారు. సినిమా షూటింగ్, రాజకీయ మీటింగులు వేరు బాలకృష్ణ తెలుసుకోవాలరాని, తెలుగు ప్రజలకు బాలకృష్ణ, చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసిన దీక్ష‌లో మంత్రులు, సీఎం ముందే బాల‌య్య మాట్లాడిన మాటలు తెలుగు ప్రజల ప్రతిష్ఠను దిగజార్చే విధంగా ఉందని కిష‌న్ రెడ్డి అన్నారు. బాలకృష్ణ తానే మాట్లాడారా లేక చంద్రబాబు మాట్లాడించారా అనేది వెల్ల‌డించాల‌ని డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా బీజేపీ తో పొత్తుండి ఇప్పుడు టీడీపీ ఇలా చేయటం మంచిది కాదని అన్నారు. దేశం కోసం నాలుగేళ్లుగా సెలవు పెట్టకుండా అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. సినిమాలకే పరిమితమైన బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలను మర్చిపోయారని విమ‌ర్శించారు. `తాను తలుచుకుంటే రాష్ట్రంలో కేంద్ర వాహనాలు తిరగనువ్వను అని అంటున్నాడు. సీఆర్పీఎఫ్ వాహనాలు, నౌకాయాన వాహనాలు, శ్రీహరి కోటకు వచ్చే వాహనాలను రానివ్వడా? ఏ వాహనాలను రాష్ట్రంలోకి రానివ్వడో చెప్పాలి` అంటూ డిమాండ్ చేశారు.

బీజేపీ లేకుండా టీడీపీ, చంద్రబాబు ఎప్పుడైనా గెలిచాడా అని కిష‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. `2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాం. తాను చేసిన మోసం వల్ల ఓటమి పాలయ్యాం. 2014 లో కూడా బీజేపీ తో పొత్తు పెట్టుకొని చంద్రబాబు మళ్ళీ గెలిచాడు. పవన్ సహకారం లేకపోతే చంద్రబాబు ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడు....వ్యక్తిగతంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రధాని పై మాట్లాడటం ఎంత వరకు న్యాయం చంద్రబాబు? ఎన్టీఆర్‌ను గద్దె దింపడం లో బాలకృష్ణ పాత్ర ఉంది` అంటూ మండిప‌డ్డారు.
Tags:    

Similar News