లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు :కిషన్ రెడ్డి

Update: 2020-04-30 05:15 GMT
కరోనా వైరస్  నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకే లాక్‌ డౌన్. ఈ లాక్ డౌన్ ఆంక్షలు అందరికీ సమానమే. అధికార పక్షమైనా, విపక్షమైనా నిబంధనలు పాటించి తీరాల్సిందే. లాక్ ‌డౌన్‌ ఆంక్షలను  ఉల్లంఘించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.  ప్రత్యేకంగా పార్టీల పేర్లు చెప్పకుండా జనాలను పోగేసుకొని ఈ కరోనా కష్ట సమయంలో రోడ్ల వెంబడి తిరుగుతున్న నేతలకి  చురకలంటించారు.

బుధవారం కిషన్‌ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘కొందరు ట్రాక్టర్‌ ర్యాలీలు - సమావేశాలు - చిన్న చిన్న సభలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా సూచించాను’’ అని తెలిపారు. కేసుల సంఖ్య తగ్గుముఖంపట్టి, ప్రస్తుతం కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న వారంతా  కోలుకునేదాకా లాక్ ‌డౌన్‌ కొనసాగుతుందని ఆయన తెలిపారు.   కరోనా తీవ్రతను అనుసరించి గ్రీన్‌ జోన్‌ లలో మాత్రమే ఆంక్షల విధింపులో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు,   పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించేందుకు అనుమతించామన్నారు. 

అయితే బస్సులు - రైళ్లు - విమాన సర్వీసుల ద్వారా నిర్వహించే ప్రజా రవాణాకు ఇప్పట్లో అనుమతి ఇవ్వబోమని అయన మరోసారి స్పష్టం చేశారు. మే 3వ తేదీ తర్వాత గ్రీన్‌ జోన్ల లో లాక్‌ డౌన్‌ లో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని యోచిస్తున్నామని... దీనిపై ప్రధాని మోదీ ఉన్నతాధికారులు - నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ప్రత్యేకమైన మెడికేటెడ్‌ కరోనా  ఆస్పత్రులు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.215కోట్లు ఇచ్చామని కిషన్‌ రెడ్డి చెప్పారు. కరోనా కట్టడి - చికిత్స పై మన దేశానికి చెందిన అనేక కంపెనీలు పరిశోధనలకు ముందుకు వస్తున్నాయని - ఇతర దేశాలు కరోనా కట్టడికి మందు తయారీకి ప్రయత్నిస్తున్నాయని కిషన్‌ రెడ్డి తెలిపారు.
Tags:    

Similar News