రెండు రోజుల నుంచి ఆ ఆస్పత్రిలోనే కొడాలి నాని!

Update: 2022-11-19 08:41 GMT
వైసీపీలో ఫైర్‌బ్రాండ్‌.. కొడాలి నాని. అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, మరోవైపు జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసేవారిలో ముందు వరుసలో ఉంటారు.. నాని.

ప్రస్తుతం వైసీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల కోఆర్డినేటర్‌గా ఉన్నారు.. కొడాలి నాని. తాజాగా ఆయన కిడ్నీ సమస్యతో ఆస్పత్రిపాలయ్యారని తెలుస్తోంది. అపోలో ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారని చెబుతున్నారు. రెండు రోజుల క్రితమై అపోలో ఆస్పత్రిలో చేరగా.. ఈ సమాచారం వెలుగుచూసిందని అంటున్నారు.

నానికి కిడ్నీలో రాళ్లున్నాయని సమాచారం. ఇన్నాళ్లూ ఆయన వాటిని లైట్‌ తీసుకోవడంతో ఇప్పుడవి ఆయనను బాగా ఇబ్బంది పెడుతున్నాయని.. దీంతో చికిత్స కోసం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారని చెబుతున్నారు.

ఇన్నాళ్లూ నాని తన కిడ్నీల్లో ఉన్న రాళ్లను నిర్లక్ష్యం చేయడంతో అవి పెరిగాయని.. లే జర్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా వాటిని కరిగించాలని వైద్యులు చెప్పినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. లేజర్‌ చికిత్స కోసమే కొడాలి నాని అపోలో ఆస్పత్రిలో చేరారని.. రెండు మూడు రోజుల్లోనే ఆయన డిశ్చార్జ్‌ కావచ్చని అంటున్నారు.

మళ్లీ రెండు మూడు వారాల్లో కీలకమైన ఆపరేషన్‌ చేస్తారని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం నొప్పి తీవ్రం కావడం, ఒళ్లంతా వాపు వచ్చినట్టు ఉండటం వంటి సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లారని తెలుస్తోంది.

రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండటం, ఆహారపు అలవాట్లు తదితర కారణాలతోనే చిన్న సమస్య పెద్దగా మారిందని వైద్యులు చెప్పినట్టు సమాచారం.

కాగా కొడాలి నాని ఆస్పత్రిపాలయ్యారనే సమాచారం తెలియడంతో గుడివాడ వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న కొడాలి నాని క్షేమంగా కోలుకుని రావాలని ప్రార్థిస్తున్నాయి.

కాగా 2004 నుంచి కృష్ణా జిల్లా గుడివాడ నుంచి కొడాలి నాని వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్నారు. వైఎస్‌ జగన్‌ తొలి మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని బాధ్యతలు చేపట్టారు.

జగన్‌ రెండో మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి పోయింది. కొడాలి నానిని జగన్‌ గుంటూరు, పల్నాడు జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్‌గా నియమించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News