లెక్క‌ల‌తో కేసీఆర్‌ కు ఝ‌ల‌క్ ఇచ్చిన కోదండ‌రాం

Update: 2017-03-13 08:26 GMT
లక్ష ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డం ఖాయ‌మ‌ని, ఈ క్ర‌మంలో రాజ‌కీయ నిరుద్యోగుల వెంట న‌డ‌వ‌వ‌ద్ద‌ని శాసనసభ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఘాటుగా రియాక్ట్ అయ్యారు. స‌వివ‌ర అంకెల‌తో ఆయ‌న కేసీఆర్‌కు రిప్లై ఇచ్చారు. ఉద్యోగాల విషయంలో కేసీఆర్ అసెంబ్లీ వేదిక‌గా చెప్పిన మాటలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని అన్నారు. 2014 నవంబర్ లో అసెంబ్లీ సాక్షిగా రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇదే విషయాన్ని యువత ప్రశ్నిస్తే ఎందుకంత అసహనమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం యువత ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. యువత కన్నీరు పెట్టడం ఏ ప్రభుత్వానికి మంచిది కాదని, వారి త్యాగాల ఫలితంగానే అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ ఉద్యమకారులను అరాచక శక్తులుగా, విధ్వంసకారులుగా చిత్రీకరిస్తారా అని కోదండ‌రాం ప్రశ్నించా రు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రస్తుతం ఉన్న రీతిలో నిర్బంధాలు లేవని, ఇలాంటి ప్రజాస్వామ్య విలువల కోసమేనా మనం పోరాడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్ ప్రణాళికలో ప్రజాస్వామ్య విలువలు, నిరసన హక్కును కాపాడుతామని చెప్పిన విషయాన్ని అప్పుడే మరిచిపోతే ఎలా అని అన్నారు. ప్రభుత్వం భర్తీ చేసి నట్టు ప్రకటించిన 27,000 ఉద్యోగాలలో ఆర్‌ టీసీ - విద్యుత్ సంస్థలలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించిన ఉద్యోగాలను తీసివేస్తే మిగిలిన 22 వేల ఉద్యోగాలలో 2 వేల ఉద్యోగాలు ఇంకా భర్తీ కాలేదని, మొత్తంగా 20 వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ లెక్కల ప్రకారం ఏటా సగటున ఇచ్చినవి 6700కు కూడా మించడం లేదని, కాంగ్రెస్ తన 40 ఏళ్లలో మూడు లక్షల ఉద్యోగాల ఇవ్వడమంటే సగటున 7500ల ఉద్యోగాలు ఇచ్చినట్టేనని, ఇది టీఆర్‌ ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సగటు కంటే కూడా ఎక్కువగా ఉన్నాయని కోదండ‌రాం విశ్లేషించారు.

"టీఆర్‌ ఎస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఖాళీలు 30,000. ఆంధ్ర ఉద్యోగులు వారి రాష్ట్రాలకు వెళ్లడంతో ఏర్పడిన ఖాళీలు సుమారు మరో 30,000., ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న ఖాళీలు సుమారు 50 వేలు. కొత్తజిల్లాల ఏర్పాటుతో అవసరమైన పోస్టులు సుమారు 5000. విద్యుత్ సంస్థలలో పెరుగుతున్న అవసరాల నిమిత్తం ప్రతిపాదించిన కొత్త పోస్టులు సుమారు 15,000. కొత్త కార్పొరేషన్ల అవసరాలకు సుమారు 5000 పోస్టులు. కొత్తగా అవసరమైన అదనపు పోస్టులు 25000. అంఏట ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో మొత్తం రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం ప్రతి ఏటా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తుందో ఒక క్యాలెండర్‌ను విడుదల చేయాలి"అని కోదండ‌రాం స్ప‌ష్టంగా డిమాండ్ చేశారు.  ప్రైవేటు సంస్థలలో స్థానికులకు రిజర్వేషన్లను కల్పించాలని ఆయ‌న కోరారు. కాంట్రాక్ట్ - అవుట్‌ సోర్సింగ్ ఉద్యో గులను క్రమబద్దీకరణ చేసే వరకు ముందుగా వారికి సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రణాళిక ప్రకటించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని తక్షణం అమలు చేయాలన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News