కోదండంరాం పిలుపు..చ‌లో అసెంబ్లీ

Update: 2017-02-02 11:47 GMT
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం మ‌రోమారు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇటీవ‌లి వ‌ర‌కు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించిన కోదండ‌రాం ఇపుడు పెద్ద సంఖ్య‌లో ఉన్న యువ‌త స‌మ‌స్య‌ల‌పై గ‌ళం ఎత్తారు.వామ‌ప‌క్ష అనుబంధ విద్యార్థి సంఘాలైన‌ ఏఐఎస్‌ ఎఫ్‌ - ఏఐవైఎఫ్ 14 రోజుల బస్సుయాత్ర ముగింపు సందర్భంగా ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. మహాధర్నాకు సీపీఐ నేత చాడ వెంకట్‌ రెడ్డి - తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం - ఆచార్య హరగోపాల్‌ లు హాజరయ్యారు. ఈసందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం తీరును త‌ప్పుప‌ట్టారు. ప్రభుత్వం ఏటా 25వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని, ఆ లెక్క‌న‌ ప్రభుత్వ రంగంలో ఇప్పటికే 50వేల ఉద్యోగాలు భర్తీ చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు  కేవలం 15 వేల ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం భ‌ర్తీ చేసింద‌ని కోదండ‌రాం అన్నారు. అదే స‌మ‌యంలో రిటర్మెంట్ల‌తో రెండేళ్లలో తెలంగాణలో 30వేల ఉద్యోగాలు ఖాళీ అయ్యాయని  అన్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకున్న యువత ఇంటికి వెళ్ళలేక.. ఇక్కడ ఉండలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పటికే  ప్రభుత్వానికి అనేక సార్లు తెలియ చేసినా లాభం లేకుండా పోయిందని కోదండ‌రాం వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ రంగంలో 2లక్షల ఖాళీలున్నాయని తెలిప‌న కోదండ‌రాం వీటిని వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేశారు. మా కొలువులు మాకు కావాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న టీ-జాక్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగుల ర్యాలీ చేపడతామని కోదండరాం తెలిపారు. తెలంగాణ ఉద్య‌మ నినాద‌మే నీళ్లు-నిధులు-నియామ‌కాలు అని గుర్తు చేసిన కోదండ‌రాం కీల‌క‌మైన నిధుల విష‌యంలో ప్ర‌భుత్వం త‌న వైఖ‌రిని స‌మీక్షించుకోవాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ రంగంలోని కొలువుల‌న్నింటినీ భ‌ర్తీ చేసి తెలంగాణ ఉద్య‌మ ఆకాంక్ష‌ను నెరవేర్చాల‌ని కోదండ‌రాం డిమాండ్ చేశారు. విద్య - వైద్యం - ఉపాధి అవకాశాలు ప్రజల హక్కులుగా ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. మెరుగైన విద్యాభ్యాసం అందిస్తామ‌న్న మాట‌ను నిలుపుకోవాల‌ని ఆయ‌న కోరారు. రాష్ట్ర ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నిస్తున్న తెలంగాణ జేఏసీ నేతలపై పోలీసుల దాడులు దారుణమన్నారు. గ‌తంలో ఇంత‌కంటే బ‌ల‌మైన‌ నిరోధాన్ని ఎదుర్కున్నామ‌ని పేర్కొంటూ ప్ర‌జాస్వామ్యయుతంగా ప్ర‌భుత్వ తీరును ఎండ‌గడుతామ‌ని కోదండ‌రాం తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News