కేసీఆర్ జిల్లాల ఏర్పాటుపై కోదండం ఫైర్

Update: 2016-08-23 11:33 GMT
కేసీఆర్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న ఆయన మాజీ గురువు - తెలంగాణ ఉద్యమ రథ గుర్రాల్లో ఒకరైన జేఏసీ ఛైర్మన్ కోదండరాం మరోసారి విమర్శల వర్షం కురిపించారు. కొత్త జిల్లాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. లేకపోతే ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఐదో షెడ్యూలులోని ఏజెన్సీ ప్రాంతాలు అన్నింటినీ ఒకే జిల్లాలో ఉంచాలని కోరారు. వరంగల్‌ ను రెండు జిల్లాలుగా విభజించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలపాలని ఆయన అన్నారు.

నిజానికి తెలంగాణలో జిల్లాల విభజనపై ఎక్కువగా వ్యతిరేకత లేదు. విపక్షాలు కూడా తాము కోరుతున్న జిల్లాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నాయే కానీ కొత్త జిల్లాల ఏర్పాటును పెద్దగా వ్యతిరేకించడం లేదు. ఇలాంటి వేళ.. కోదండరాం ఒక్కసారిగా జిల్లాల ఏర్పాటుకు గల కారణాలను - వాటి వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పాలని ప్రశ్నించడంతో టీఆరెస్ ప్రభుత్వం కొంత ఇరకాటంలో పడింది.  గద్వాల - జనగామ ప్రాంత ప్రజల అభిప్రాయాలను కూడా గౌరవించాలని కోదండం కోరుతున్నారు.

మరోవైపు మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకోవాలనుకుంటున్న ఒప్పందంపైనా ఆయన మాట్లాడారు. ఈ విషయంలో పారదర్శకత అవసరమని సూచించారు. ఒప్పందానికి తాము వ్యతిరేకం కాదని.. కానీ, ఒప్పందం వివరాలేంటో బహిర్గతం చేయాలని కోరారు.  గ్యాంగ్‌ స్టర్ నయీముద్దీన్ డైరీలో ఉన్న వివరాలు అన్నింటినీ కూడా బయటపెట్టాలని.. నయీంతో ఎవరెవరికి సంబంధాలున్నాయో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Tags:    

Similar News