ర‌గిలిపోతున్న కోదండ‌రాం

Update: 2018-11-13 07:51 GMT
కాంగ్రెస్ గురించి ప్ర‌జ‌ల‌కు కొత్త‌గా చెప్పేదేముంది? అయితే, మోడీ ఎఫెక్ట్‌తో అయినా వారు మారార‌ని చాలా మంది న‌మ్మారు. కానీ ఇప్ప‌టికీ కాంగ్రెస్‌ లో అరాచ‌క వ్య‌వ‌స్థ కొనసాగుతూనే ఉంది. కేసీఆర్‌ ది మోసం - ఆయ‌న‌ను ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని చెప్పిన కాంగ్రెస్ కుక్క‌ను నిల‌బెట్టి కూడా ఎన్నిక‌ల్లో గెలుస్తాం అని చెప్ప‌గ‌ల‌గాలి. కానీ... నాలుగైదు పార్టీల‌తో పొత్తులు పెట్టుకున్నా అనేక అనుమానాల‌తో భ‌యాల‌తో అర్ధ‌రాత్రి లిస్టు రిలీజ్ చేసింది. య‌థావిధిగా పొత్తు పార్టీల‌కు అన్యాయం చేసింది.

కాంగ్రెస్ వ్య‌వ‌హారంతో తెలంగాణ జ‌న స‌మితి అధినేత కోదండ‌రాం క‌డుపు  ర‌గిలిపోతుంది. రాష్ట్రమంతా పోటీ చేసే శ‌క్తి ఉన్నా తెలంగాణ కోసం కాంగ్రెస్‌ తో క‌లిస్తే ఇంత మోస‌మా అని కోదండ‌రాం మండిప‌డుతున్నార‌ట‌. ఇదిగో.. అదిగో అంటూ నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే వ‌ర‌కు ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ 65 మందితో కూడిన తొలి జాబితా అర్ధరాత్రి విడుదల చేసింది.

కానీ ఈ జాబితా చూశాక ఆలేరు - ఆసిఫాబాద్ - స్టేషన్‌ ఘన్‌ పూర్ - తాండూరు స్థానాలను ఆశించిన కోదండ‌రాం తీవ్రంగా డిజ‌ప్పాయింట్ అయ్యారు. టీజేఎస్‌ అడిగిన స్థానాల్లోను అభ్యర్థులను ప్రకటించింది. స్టేషన్‌ ఘన్‌ పూర్‌ నుంచి సింగపూర్‌ ఇందిరను - ఆలేరు నుంచి బూడిద బిక్షమయ్యగౌడ్‌ - ఆసిఫాబాద్‌ లో అత్రం సక్కు - తాండూరు నుంచి పంజుగుల పైలట్‌ రోహిత్‌ రెడ్డిల పేర్లను ఖారారు చేసింది. 

ఇక సీపీఐకి కూడా కాంగ్రెస్ బానే షాకిచ్చింది. కొత్తగూడెం సీటును సీపీఐ ఆశిస్తోంది. అయితే, ఆ స్థానాన్ని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు ఇచ్చింది కాంగ్రెస్‌. అలాగే తెలంగాణ ఇంటి పార్టీ ఆశించిన నకిరేకల్ సీటూ వారికి ద‌క్క‌లేదు. అక్క‌డ కోమ‌టిరెడ్డి అనుచ‌రుడు చిరుమర్తి లింగయ్యను అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించింది.

కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రించిన ఈ తీరు మ‌హాకూట‌మి మిత్ర‌ప‌క్షాల‌ను ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా చిన్న పార్టీలన్నీ ఆందోళ‌న చెందుతున్నాయి. డైల‌మాలో ప‌డ్డాయి. అయితే, త‌క్కువ స‌మ‌యం ఉండ‌టంతో ఆ పార్టీలు అయోమ‌యంలో ఉన్నాయి.
   

Tags:    

Similar News