పోలీస్ స్టేష‌న్లో వారిద్ద‌రి మ‌ధ్య పొత్తు చ‌ర్చ‌లు!!

Update: 2018-09-11 05:20 GMT
అనుకోని రీతిలో స‌రికొత్త ప‌రిణామం తెలంగాణ రాజ‌కీయాల్లో చోటు చేసుకుంది. ఇందుకు వేదిక‌గా పోలీస్ స్టేష‌న్ కావ‌టం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తుల మాటలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న వేళ‌.. ఈ పొత్తుకు మ‌రింత బ‌లం చేకూరే కీల‌క ప‌రిణామం ఒక‌టి తాజాగా చోటు చేసుకుంది. కాంగ్రెస్‌.. తెలుగుదేశం మ‌ధ్య పొత్తులు ఒక ప‌క్క‌న జ‌రుగుతున్నాయ‌న్న ప్ర‌చారం సాగుతున్న వేళ‌.. మ‌రోవైపు తెలంగాణ సాధ‌న‌లో కీల‌క‌భూమిక పోషించిన కోదండం మాష్టారి తెలంగాణ జ‌న‌స‌మితి మ‌ధ్య ఎన్నిక‌ల పొత్తుపై మాట‌లు మొద‌ల‌య్యాయి.

ఈ కీల‌క ప‌రిణామానికి వేదిక‌గా చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ కావ‌టం విశేషం. భార‌త్ బంద్ లో భాగంగా సోమ‌వారం ఉద‌యం నిర‌స‌న తెలుపుతున్న వివిధ పార్టీ నేత‌ల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ ర‌మ‌ణ‌.. తెలంగాణ జ‌న స‌మితి అధ్య‌క్షుడు కోదండరాంలు ఇద్ద‌రు పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు

ఈ సంద‌ర్భంగా వారిద్ద‌రి మ‌ధ్య పొత్తుల ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. తెలంగాణ‌లో తాజాగా నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇరువురు నేత‌లు పొత్తుల విష‌యంపై చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌న్న ప్రాథ‌మిక నిర్ణ‌యానికి వ‌చ్చారు. పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర్వాత మాట్లాడుకుందామ‌న్న కోదండం మాష్టారి మాట‌ల‌కు ర‌మ‌ణ ఓకే చెప్పారు.

అరెస్ట్ అనంత‌రం పోలీస్ స్టేష‌న్లో ఈ మాట‌లు జ‌రిగిన త‌ర్వాత‌.. కొంత‌సేప‌టికి వారిద్ద‌రిని పోలీసులు విడుద‌ల చేశారు. అనంత‌రం వారు సాయంత్రం మిన‌ర్వాలో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడా వెంక‌ట‌రెడ్డి.. స‌హాయ కార్య‌ద‌ర్శి ప‌ల్లా వెంక‌ట‌రెడ్డిల‌తో పాటు.. తెలంగాణ జ‌న‌స‌మితికి చెందిన విద్యాధ‌ర్ రెడ్డి.. టీడీపీ నేత పెద్దిరెడ్డి సైతం పొల్గొన్నారు.

తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట వారిలో వ్య‌క్త‌మైంది. ఈ మూడు పార్టీల నేత‌లు కాంగ్రెస్ తో క‌లిసి చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించారు. ఒకేసారి నాలుగు పార్టీల నేత‌లు కూర్చొని చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర్వాత మ‌హా కూట‌మికి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేయాల‌ని నిర్ణ‌యించారు.

నాలుగు పార్టీలు క‌లిసి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న త‌ర్వాత‌.. పొత్తుల లెక్క‌లు తేలిన త‌ర్వాత అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌న్న మాట చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే..సీట్ల విష‌యంలో కొంత మేర త్యాగాలు చేయాల‌న్న భావ‌న నాలుగు పార్టీల నేత‌ల్లో వ్య‌క్తమైన‌ట్లుగా తెలుస్తోంది. గెలుపే ల‌క్ష్యంగా ముందుకు న‌డ‌వాలే కానీ.. మ‌రింకేమీ ప‌ట్టించుకోవ‌ద్ద‌న మాట వారి మ‌ధ్య వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News