కోదండా...బాబుతో జర జాగ్రత్త!?

Update: 2018-11-12 18:26 GMT
తెలంగాణ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించడమే ఏకైక ఎజెండా ఎన్నికల బరిలోకి దిగుతున్న మహాకూటమికి రోజుకో భయం వెంటాడుతోంది. కాంగ్రెస్ పార్టీ కాని - తెలుగుదేశం కాని - సిపీఐ కాని అనుభవం ఉన్న పార్టీలే కావడంతో రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల రచనలో ఆయా పార్టీల నేతలు కాసింత బలంగానే ఉన్నారు. అయితే మహాకూటమిలో మరో పార్టీ తెలంగాణ జన సమితికే బాలారిష్టాలు తప్పడం లేదు. నిజానికి ఇవి బాలారిష్టాలు కూడా కాదు. ముందస్తు ఎన్నికలే తెలంగాణ జన సమితి భవిష్యత్ ను నిర్ణయిస్తాయంటున్నారు. తెలంగాణలో మేథావి వర్గంగా పేరు తెచ్చుకున్న ప్రొఫెసర్ కోదండరాం అండ్ కో  రాజకీయాలు చదువుకున్నారు కాని... వాటి ఆచరణ మాత్రం అనుభవం లేదు. ఇదే ఆ పార్టీకి కష్టాలు తీసుకువస్తుందేమోనని కోదండ రాం సన్నిహితులు ఆయనకు జాగ్రత్తలు చెబుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీతో ముఖ్యంగా పూర్తిగా మారిన రాహుల్ గాంధీతోనూ - తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో కోదండ రాంకు పెద్దగా సమస్యలు రావని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వారిలో వారు తగువులు - తంటాలు తెచ్చుకుంటారు కాని ఇతర పార్టీల వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలుండవనే పేరుంది. పైగా  కాంగ్రెస్ పార్టీ అధిష్గానం అంతా యువకులతో నిండిఉండడం - రాహ‍ుల్ గాంధీలో పరిణితి చెందిన రాజకీయ నాయకుడు కనిపించడం ఇందుకు సంకేతంగా చెబుతున్నారు. అలాగే సిపిఐ కూడా కొన్ని నియమనిబంధనలు - సిద్ధాంతాలకు లోబడి ఉన్న పార్టీ అని - వారితో ఇబ్బందులుండవని కోదండకు ఆయన సన్నిహిత మిత్రులు చెప్పినట్లు సమాచారం.

ఇక మ‌హాకూటమిలో మిగిలిన మరో పార్టీ తెలుగుదేశం పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని మేథావులు కోదండరాంను హెచ్చరిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడి రాజకీయాలకు - వ్యూహాలకు మహా మహా నాయకులు - పార్టీలే కుదేలయ్యారని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన కోసం - తన ఉనికి కోసం ఎలాంటి కార్యక్రమానికైనా వెనుకాడరని - దీనికి తన సొంత కుటుంబమే పెద్ద తార్కాణమని చెబుతున్నారని సమాచారం. ఆయనతో నేరుగా మాట్లాడకపోయినా ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు తన చక్రం తిప్పుతారని - దీనికి బలి కాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. " చంద్రబాబు నాయుడు జిత్తుల మారి. తన అవసరం కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు.దీనికి గత అనుభవాలే తార్కాణం. చివరికి తన భద్రత కోసం - మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నారు. ఇవన్నీ మీరు గమనించి తెలుగుదేశం పార్టీతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడితో జాగ్రత్తగా వ్యవహరించండి" అని కొందరు మేథావులు కోదండరాంకు సూచించినట్టు చెబుతున్నారు.  రాజకీయాలంటే గొంతులు కోయడమేనని, ఆ పని కోదండ రాం వంటి వారికి రావని కూడా ఆ మేథావులు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ జన సమితికి మాత్రం చంద్రబాబు నాయుడి భయం వెంటాడుతున్నట్లే కనిపిస్తుంది.

Tags:    

Similar News