కోదండ‌రాంకు షాక్‌..నెక్స్ట్ ఏంటి?

Update: 2018-11-17 08:31 GMT
ఓ వైపు నామినేష‌న్ల‌కు ముహుర్తం ముగిసిపోతుంటే...మ‌రోవైపు ఆయా పార్టీల అంత‌ర్గ‌త రాజ‌కీయాలు ముదురుపాకాన ప‌డుతున్నాయి. కూట‌మి రూపంలో జ‌ట్టుక‌ట్టిన విప‌క్షాల్లో అయితే - ఇది మ‌రింత హాట్ హాట్‌ గా మారుతోంది. తాజాగా జనగామ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత - మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పోటీకి లైన్‌ క్లియర్ అవ‌డం చ‌ర్చ‌ను మ‌రింత తారాస్థాయికి చేర్చింది. పొన్నాల‌కు టికెట్ ఖ‌రారైన క్ర‌మంలో.... తెలంగాణ జనసమితి వ్య‌వ‌స్థాప‌కుడు కోదండ‌రాం ప‌రిస్థితి ఏంట‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వస్తోంది. తాను బ‌రిలో దిగ‌డం లేదని కోదండ‌రాం పేర్కొంటున్న‌ప్ప‌టికీ...ఆయ‌న త‌ప్పుకున్నారా...త‌ప్పించారా అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

నిన్న మొన్నటి వరకు జనగామ నుంచి కోదండరాం పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. కోదండ‌రాం ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చార వాహనాల‌ను సైతం సిద్ధం చేసుకున్నారు. అయితే, పొన్నాల ఢిల్లీలో భారీ స్థాయిలో లాబీయింగ్ జరిపి.. జనగామ స్థానాన్నే తనకే దక్కేలా పావులు కదిపారు. రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమైన పొన్నాల.. ఇక్కడి పరిస్థితులను వివరించి తనకే టికెట్ ఇవ్వాలని కోరారు. ఇలా జనగామ నుంచి పొన్నాలే బరిలోకి దిగ‌డం ఖ‌రారైన స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ త‌న ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టింది. శుక్ర‌వారం అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ ఆర్సీ కుంతియా - పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి - పొన్నాల లక్ష్మయ్య.. నాంపల్లిలోని తెలంగాణ జనసమితి కార్యాలయంలో భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు కోదండారాంతో చర్చించారు. అనంతరం మీడియాతో కుంతియా మాట్లాడారు. జ‌న‌గామా స్థానాన్ని కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు టీజేఎస్‌ నేత కోదండరాం అంగీకరించారని ఆయన చెప్పారు. 14 సీట్లలో టీడీపీ - 8 చోట్ల జనసమితి - 3 సీట్లలో సీపీఐ పోటీ చేస్తుందని చెప్పారు. తాజాగా వెలువ‌డిన జాబితాలో ఆయ‌న పేరును కాంగ్రెస్ ఖ‌రారు చేసింది. అన్న‌ట్లుగానే టికెట్ పొన్నాలను వ‌రించింది.

ఉత్కంఠ న‌డుమ‌ మొత్తానికి జనగామ సీటు పొన్నాలకే వరించగా.... ఇప్పుడు కోదండరాం ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే తెలియాల్సి ఉంది. మహాకూటమిలో భాగంగా తెలంగాణ జన సమితికి 8 స్థానాలు కేటాయించారు. వీటిలో మెదక్ - దుబ్బాక - సిద్దిపేట - మల్కాజ్‌ గిరి - వర్ధన్నపేట - అంబర్‌ పేట స్థానాల నుంచి టీజేఎస్ పోటీ చేయనుంది. మరో రెండు స్థానాలు ఏవి అనేది తేలాల్సి ఉంది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డి నుంచైనా కోదండ‌రాం బ‌రిలో ఉంటారా...లేక‌పోతే కాంగ్రెస్ మార్క్ రాజ‌కీయాల్లో భాగంగా ఆయ‌న పోటీకి దూరంగా ఉంటారా అనేది తేలాల్సి ఉంది.
Tags:    

Similar News