కోదండ పార్టీ టీజేఎస్...పోలీసుల అనుమ‌తే ఆల‌స్యం

Update: 2018-03-31 16:50 GMT
కొద్దికాలంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌కు ఫుల్‌ స్టాప్ ప‌డింది. తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోంది. టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం నేతృత్వంలో పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ జనసమితి పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. పార్టీ పేరు - జెండా - ఎజెండాలను త్వ‌ర‌లో ఖరారు చేయబోతున్నారు. ఏప్రిల్ 2న పార్టీ ప్రకటించనున్న కోదండరాం.. ఏప్రిల్ 4న జెండా ఆవిష్కరించనున్నారు. ఏప్రిల్ 29న పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. అయితే ఇందుకు పోలీసుల అనుమ‌తి ఇవ్వ‌డం ముఖ్య అంశంగా మారింద‌ని తెలుస్తోంది.

తెలంగాణ ఉద్య‌మంలో క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రించిన ప్రొఫెస‌ర్ కోదండ‌రాం పార్టీ ఏర్పాటుకు సిద్ధమైన సంగ‌తి తెలిసిందే. కోదండరాం పెట్టబోయే పార్టీ పేరు తెలంగాణ జనసమితిగా ఓకే అయిన‌ట్లు సమాచారం అందుతోంది. పార్టీ జెండా రూపకల్పన కూడా పూర్త‌యిందని చెబుతున్నారు.  జెండాలో తెలుపు - నీలం - పచ్చ రంగులతో పాటు అమరవీరులు, కార్మికులు - రైతుల చిహ్నాలను ఉంచినట్టు తెలుస్తోంది. అయితే హైదరాబాద్‌ లో ఏయే ప్రాంతాల్లో సభ ఏర్పాటు చేయొచ్చనే అంశంపై కూడా కోదండరాం ఇప్పటికే పోలీసులను సంప్రదించారు. పోలీసులు ఎక్కడ సభకు అనుమతి ఇస్తే.. అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.  

హైద‌రాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియం - ఎన్టీఆర్ స్టేడియంలలో ఏదో ఒక చోట సభను నిర్వహించాలని కోదండరాం భావిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ స‌భ‌కు జాతీయ నాయ‌కుల‌ను ఆహ్వానించాల‌ని ఆయ‌న చూస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌ముఖ రైతు సంఘాల నాయ‌కులు సహా జాతీయ స్థాయిలో పేరున్న సామాజిక‌వేత్త‌ల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News