కోదండ మాస్టారి పార్టీ...ఇప్పుడే కాద‌ట‌!

Update: 2018-03-09 05:10 GMT
తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామంగా మార‌నుంద‌ని ప‌లువురు ఆశించిన‌ ప్రొఫెసర్ కోదండరామ్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఆస‌క్తిక‌ర మ‌లుపు తిరిగింది. పార్టీ ప్రారంభానికి ముందే ట్విస్టు ఇచ్చింది. జేఏసీ చైర్మెన్‌ కోదండరామ్‌ నేతృత్వంలో పార్టీ ఏర్పాటు వాయిదా పడింది. ముందస్తుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల 10న పార్టీ పేరును ప్రకటించాల్సి ఉండగా.. జేఏసీ నేత‌లు వాయిదా వేసుకున్నారు. పార్టీ ఏర్పాటును వచ్చే నెలలో ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్‌ ఎస్‌ పాలన కొనసాగడం లేదన్న కారణంగా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని కోదండరామ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. `ప్రొఫెసర్ కోదండరామ్‌ ఎప్పుడైనా సర్పంచ్‌ గా ఆఖరికి వార్డు మెంబర్‌ గానైనా గెలుపొందారా? ఆయ‌నకు మా స‌ర్కారును విమ‌ర్శించే హ‌క్కుందా` అని గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ స‌హా టీఆర్‌ ఎస్ నాయకులు అనేక సార్లు ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్ల‌ను ప‌ట్టుద‌ల‌గా తీసుకొని...రాజకీయ పార్టీ పెట్టడం ద్వారానే తాను ఏమిటో - తన సత్తా ఏమిటో - నిరూపించుకోవాలన్న పట్టుదలతో జేఏసీ చైర్మ‌న్‌ ఉన్నారని అంచనా వేశారు. తెలంగాణ సాధన కోసం 'మిలియన్‌ మార్చ్‌' నిర్వహించిన మార్చి 10న కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించాలని భావించారు. అయితే దీనికి ఆదిలోనే బ్రేక్ ప‌డింది. అజెండా తదితర అంశాల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వాయిదా వేసుకున్నట్టు సమాచారం. కాగా, జేఏసీ పార్టీకి 'తెలంగాణ జన సమితి' పేరును ఖరారు చేసుకున్నట్టు ప్రచారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News