కోదండరాం అండ్ కో హాహాకారాలు విన్నారా?

Update: 2016-03-24 06:40 GMT
నిజమైన నాయకుడు ఎవరు? నిజమైన సంరక్షకుడు ఎవరు? ప్రజాసంరక్షణ కోరుకునే వారు ఎలా ఉంటారు? లాంటి ప్రశ్నలు వేసుకొని.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండం మాష్టారిని చూస్తే ఇంచుమించు ఆయనలా ఉండాలనే అనుకుంటారు. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయనలో అలాంటి లక్షణాలు బొత్తిగా కనిపించటం లేదన్న వేదన పలువురు తెలంగాణవాదుల నోటి నుంచి రావటం కనిపిస్తుంది. తెలంగాణ ప్రజల కోసం కష్టపడతానని మాటలు చెప్పి.. తెలంగాణ ప్రజల సంక్షేమమే తన జీవితలక్ష్యంగా అన్న వ్యక్తి.. తెలంగాణకు కావలి కుక్కలా పని చేయాలే తప్పించి.. సగటు రాజకీయ నేతలా అవసరానికి తగినట్లుగా మాట్లాడకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన తెలంగాణ రాజకీయ జేఏసీ వెనుక ఎవరున్నారన్నది బహిరంగ రహస్యం. తెలంగాణ ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లేందుకు పార్టీలకు అతీతంగా వేదిక ఒకటి ఏర్పాటు చేయాలన్న మాస్టర్ మైండ్ ఆలోచన ఎవరిదన్నది తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. అయితే.. తెలంగాణ సాధనే ముఖ్యంగా భావించిన వారంతా.. జేఏసీ ఏర్పాటు వెనుకున్న ఉద్దేశ్యాన్ని.. వెనుకున్న శక్తుల్ని పట్టించుకోకుండా జేఏసీ అండతో సోనియమ్మపై ఒత్తిడి తెచ్చేందుకు నిజాయితీగా పని చేశారని చెప్పాలి.

అయితే.. తెలంగాణ జేఏసీ ఇంతలా ముందుకు కదలటానికి తెలంగాణ ప్రజల పాత్రను తక్కువ చేయలేం.  తాము కానీ తెలంగాణ రాజకీయ జేఏసీలో భాగస్వామ్యం కాకుంటే బతుకుదెరువు కష్టమన్న పరిస్థితికి తెలంగాణ ప్రజలు కీలకంగా మారారనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి తెలంగాణ రాజకీయ జేఏసీకి కీలక బాధ్యతలు చేపట్టిన కోదండరాం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎలా వ్యవహరించారన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న.

తెలంగాణ సాధన ఒక ఎత్తు అయితే.. తెలంగాణ పునర్ నిర్మాణం మరో ఎత్తు అన్న సంగతి మర్చిపోకూడదు. మరి.. ఆ విషయాన్ని కోదండరాం బాధ్యతతో నిర్వర్తించారా? అన్నది చూస్తే లేదనే చెప్పాలి. తెలంగాణ సాధన అనంతరం.. అప్పటిదాకా కాలేజీలో పాఠాలు చెప్పే మాష్టారి ఉద్యోగానికి సెలవులో ఉన్న ఆయన.. సినిమాలో మాదిరి.. మళ్లీ పుస్తకం తీసుకొని పిల్లలకు పాఠాలు చెప్పేందుకు వర్సిటీకి వెళ్లటం.. రిటైర్ కావటం లాంటివి చేశారు.

రాజకీయాల్లో కొనసాగాలా? తానే రాజకీయ శక్తిగా మారాలా? అన్న అంతర్మధనం ఒక కొలిక్కి రాకపోవటం ఒక కారణంగా చెప్పాలి. తాను రాజకీయ శక్తిగా మారితే..  ఉద్యమ సమయంలో తనకు కీలక బాధ్యతలు వచ్చేలా చేసిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు వ్యతిరేకంగా నిలవాల్సి ఉంటుందన్న సంగతి ఆయనకు తెలియంది కాదు. మానసికంగా ఇంకా స్థితికి చేరుకోని పరిస్థితుల్లో.. ఒకకాలు రాజకీయ జేఏసీ మీద.. మరోకాలు సందిగ్థం మీద వేసి జోడు పడవల ప్రయాణం చేయటం మొదలెట్టారు. కేసీఆర్ విషయంలో కటువుగా వ్యవహరించలేని బలహీనత ఉన్న కోదండరాం.. రాజకీయాల్లో ఆయనకు ఎదురెదురుగా నిలిచే అంశంపై చాలానే కన్ఫ్యూజన్ ఉంది.

ఇదిలా ఉంటే.. కేసీఆర్ తీరు మరోలా ఉంది. ఉద్యమ సమయంలో కీలకభూమిక పోషించిన చాలామందిని తన దారికి తెచ్చుకున్న ఆయన.. కోదండరాం విషయంలో మాత్రం ఆయన అనుకున్నది జరగలేదు. కొందరికి అడగకున్నా కీలక పదవులు ఇచ్చేసిన ఆయన.. కోదండరాంకు కలిసేందుకు సైతం సమయం ఇవ్వకపోవటం మర్చిపోకూడదు. తెలంగాణ సాధన తర్వాత ఇరు వర్గాల మధ్య పెరిగిన దూరం సమయంలో.. కోదండ​రాం​ కళ్లు తెరిస్తే తాజా పరిస్థితి ఉండేది కాదేమో.

తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని శక్తిలా మారాలని భావించిన కేసీఆర్.. అందుకు తగ్గట్లు రాజకీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చిన సమయంలోనూ కోదండం నోటి వెంట మాట రాలేదు. పలు పార్టీలకు చెందిన నేతల్ని ఆపరేషన్ ఆకర్ష్ తో కారు ఎక్కిస్తున్న సమయంలో ఇదేం వైఖరి అంటూ తప్పు పట్టింది లేదు. తనకు సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరించారు. చివరకు.. తెలంగాణ జేఏసీలో కీలకభూమిక పోషించి.. తెలంగాణ సాధన కోసం తమ పూర్తి అంగీకారాన్ని తెలుపుతూ కేంద్రానికి లేఖ ఇచ్చిన టీడీపీ తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితుల్లోనూ కోదండం మాష్టారు నోరు విప్పింది లేదు.

అయితే..​ ఆస్తిత్వానికి ముప్పు తమకు తప్పదన్న విషయాన్ని కోదండ​రాం​ అర్థం చేసుకోవటానికి ఎక్కువ సమయం పట్టలేదు. తెలంగాణ సాధనలో కీలకభూమిక పోషించిన తెలంగాణ రాజకీయ జేఏసీలో భాగస్వామ్యం ఉన్న పక్షాలు ఒకటి తర్వాత ఒకటిగా బయటకు వెళ్లిపోతూ.. జేఏసీ అనేదే అవసరం లేదనే మాట వచ్చాక కానీ కోదండం మాష్టారికి చురుకు పుట్టలేదు. ఇలానే ఉండిపోతే.. కష్టమనుకున్నారో ఏమో కానీ.. తాజాగా జేఏసీ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జేఏసీని కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.

ఈ సందర్భంగా అధికారపక్షం మీద విమర్శలు చేస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు. పార్టీ మనుగడ కోసం టీడీపీని ఖాళీ చేయించి.. ఇప్పుడు తెలంగాణ జేఏసీని నిర్వీర్యం చేయటానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ జేఏసీ సభ్యుల  నోటి వెంట వచ్చిన మండిపాటు చూస్తే.. కోదండరాం తాజా మైండ్ సెట్ ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. నిన్నటి వరకూ తెలంగాణ రాజకీయాల్లో అధికారపక్షం ఏం చేసినా లైట్ అన్నట్లుగా ఉన్న కోదండరాం జట్టు ఇప్పుడు హాహాకారాలు చేయటం చూసినప్పుడు ఉనికి ఎవరికైనా ఉనికే అన్నది అర్థమవుతుంది.
Tags:    

Similar News