తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామిరెడ్డిపై తెలంగాణలోని ప్రజలతోపాటు వివిధ వర్గాలు, మేధావులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటున్నారని, కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కొనే సత్తా కోదండరాంకే ఉందని వారంతా భావిస్తున్నారు. అందుకే ఇప్పటికీ పలువురు నేతలు కోదండకు కొన్ని పదవులు కట్టబెడుతున్నారు. తాజాగా రైతు జేఏసీని ఏర్పాటు చేశారు. దానికి కూడా ఆయననే చైర్మన్‌ను చేయాలని కొంతమంది భావిస్తుంటే.. మరికొంతమంది వద్దని స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పినట్లు ఆయన నడుచుకున్నారని, అంతే తప్పితే, ఆయన సొంతంగా ఉద్యమం చేసింది లేదని కొంతమంది తెలంగాణ వాదులు వివరిస్తున్నారు. కేసీఆర్ జేఏసీని ఏర్పాటు చేయడమే కాకుండా దానికింద మరిన్ని జేఏసీలను నెలకొల్పడంతో ఉద్యమ సమయంలో జేఏసీ కీలకంగా మారిందని, దాని చైర్మన్‌గా కోదండరామిరెడ్డికి కూడా కాస్త పాపులారిటీ వచ్చిందని, తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జేఏసీ ప్రాభవం కోల్పోయిందనే అభిప్రాయాలనూ వ్యక్తం చేస్తున్నారు. ఇక, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కోదండరామిరెడ్డికి కూడా కేసీఆర్ ఏదో ఒక మంచి పదవిని ఇస్తారని అంతా ఊహించారు. కానీ, ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌కు కొమ్ము కాయడానికి కోదండరామిరెడ్డి ప్రయత్నించారనే అభిప్రాయంతో కేసీఆర్ ఆయనున పక్కన పెట్టారని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తనకు ప్రత్యేక హోదా ఏమీ లేకపోవడంతో కోదండ కూడా పలు సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ, వాటిని కొనసాగించలేకపోయారు. ఇప్పుడు రైతు జేఏసీని ఏర్పాటు చేశారు. అయినా, కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కొనే సత్తా కోదండరాంకు లేదని, రైతు జేఏసీ అయినా మరొక జేఏసీ అయినా ఇకనుంచి సమర్థుడికే పట్టం కట్టాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడలేనివాళ్లు పదవులకు కూడా అర్హులు కారని వివరిస్తున్నారు.