ఏం పీకారు? ఏం పీకుతారు అని అడ‌గ‌మన్న మాష్టారు

Update: 2017-08-19 04:39 GMT
నిప్పులు చెరిగేలా మాట్లాడ‌టం ఉద్య‌మ నేత.. టీజేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాంకు అల‌వాటే. కానీ.. ఊహించ‌నిరీతిలో ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తో విసిగిపోయారేమో కానీ.. కోదండం మాష్టారి నోటి నుంచి.. ఏం పీకారు? ఏం పీకుతారు? అన్న మాట‌లు వ‌చ్చేశాయి.

ప్ర‌స్తుత ఎమ్మెల్యేల‌ను 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు నిల‌దీయాల‌ని పిలుపునిచ్చారు. ఓట్ల కోసం వ‌చ్చే ఎమ్మెల్యేల్ని ఇప్ప‌టివ‌ర‌కు ఏం పీకారు? ఏం పీకుతారు? అని నిల‌దీయాల‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత అభివృద్ధి కోసం మ‌రో పోరాటం చేయాల్సి ఉంటుంద‌ని దివంగ‌త ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్ త‌న‌తో అనాడే చెప్పారంటూ ఆయ‌న మాట‌ల్ని గుర్తు చేసుకున్నారు.

వికారాబాద్ జిల్లా తాండూరులో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న నిప్పులు చెరిగారు. అభివృద్ధిపై ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల్ని త‌ప్పు ప‌ట్టారు. జ‌య‌శంక‌ర్ మాష్టారి ఆశ‌య సాధ‌న కోస‌మే తాము పోరాటానికి సిద్ధ‌మైన‌ట్లు వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంలోని మంత్రులు.. ఎమ్మెల్యేలు అభివృద్ధిని విస్మ‌రించిన క‌మీష‌న్లు ఎక్కువ‌గా ల‌భించే ప‌నుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ఆరోపించారు. అందుకే ఎన్నిక‌ల‌వేళ ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వ‌చ్చే ప్ర‌జాప్ర‌తినిధుల్ని అభివృద్ధి విష‌యంలో ఏం పీకార‌ని ప్ర‌శ్నించాల‌ని పిలుపునిచ్చారు.   

తెలంగాణ రాష్ట్రంలో స‌భ‌లు.. స‌మావేశాల్ని నిర్వ‌హించుకునేందుకు అవ‌కాశం లేకుండా ఆంక్ష‌ల పేరిట అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని కోదండం ఆరోపించారు. అంద‌రికీ మాట్లాడే హ‌క్కును రాజ్యాంగం ఇచ్చింద‌ని.. ఆ హ‌క్కును సాధించుకునేందుకు న్యాయ‌పోరాటం చేస్తామ‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మం కోసం ఉద్య‌మించిన రోజున మాట్లాడ‌టానికి.. ఉద్య‌మాలు చేయ‌టానికి.. నిర‌స‌న‌లు తెల‌ప‌టానికి అవ‌కాశం ఉంటే.. క‌ల‌లు క‌న్న రాష్ట్రంలో మాత్రం మాట్లాడేందుకు.. స‌భ‌లు నిర్వ‌హించుకునేందుకు సైతం ఆంక్ష‌లు విధిస్తున్నారన్న రీతిలో కోదండం మాష్టారి మాట‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి ఉంటే వెంట‌నే క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. ఉద్యోగాల నియామ‌కాల ప్ర‌క‌ట‌న‌పై ప్ర‌శ్నించేందుకు ద‌స‌రా త‌ర్వాత హైద‌రాబాద్ లో భారీ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. గ‌తంలోనిజాంను మ‌తం పేరుతో ప్ర‌జ‌లు వ్య‌తిరేకించ‌లేద‌ని.. రాచ‌రిక పాల‌న‌కు వ్య‌తిరేకంగానే పోరాటం చేసిన విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు. గ్రామాల్లోని ప్ర‌జ‌లు జేఏసీ క‌మిటీలుగా ఏర్ప‌డి ప్ర‌భుత్వం ప‌నిచేలా నిల‌దీయాల‌న్నారు.
Tags:    

Similar News