కోదండం మాష్టారి 48 గంట‌ల అల్టిమేటం

Update: 2018-10-10 04:00 GMT
రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల్ని దెబ్బ తీసేందుకు చాలానే ప్లాన్స్ వేస్తుంటారు. అందులో భాగంగా వారిని అదే ప‌నిగా రెచ్చ‌గొడుతుంటారు. ప్ర‌త్య‌ర్థి ఎంత ఎక్కువ‌గా రెచ్చ‌గొడుతున్నాడంటే.. దానికి కార‌ణం అత‌గాడు తీవ్ర ఒత్తిడిలో ఉన్న‌ట్లు. ఆ చిన్న విష‌యాన్ని మిస్ అయితే జ‌రిగే న‌ష్టం అంతా ఇంతా కాదు. తాజాగా తెలంగాణ జ‌న‌స‌మితి అధినేత కోదండం మాష్టారి వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

కేసీఆర్ ను ఓడించాలంటే మ‌హా కూట‌మి త‌ప్పించి మ‌రో మార్గం లేద‌ని డిసైడ్ కావ‌ట‌మే కాదు.. టీఆర్ ఎస్‌ ను ఓడించేందుకు వీలుగా సీట్ల స‌ర్దుబాటు ఉండాల‌ని డిసైడ్ అయ్యారు. ఏదో గొప్ప కోసం టికెట్లను కోరే క‌న్నా.. గెలుస్తామ‌న్న ధీమా ఉంటేనే తీసుకోవాల‌న్న మాట కూట‌మి ఆరంభంలోనే అనుకున్న‌ట్లు చెప్పారు. మాట‌ల‌కేముంది?  మ‌స్తు చెప్పొచ్చు. కానీ.. చేత‌ల్లో నిల‌వ‌డ‌ట‌మే పెద్ద స‌వాలు.

తాజాగా అలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటోంది కాంగ్రెస్‌. 90 సీట్లు త‌మ‌తోనే ఉంచుకోవాల‌ని భావిస్తుంటే.. వీలైన‌న్ని ఎక్కువ సీట్ల‌ను చేజిక్కించుకోవాల‌ని టీడీపీ.. టీజేఎస్.. సీపీఐలు భావిస్తున్నాయి. గెలుపు సంగ‌తి త‌ర్వాత ముందు అయితే.. మిత్ర‌ధ‌ర్మంతో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా సీట్ల‌ను డిమాండ్ చేస్తూ.. ఒక‌దానిపై మ‌రొక పీట‌ముడులు వేస్తున్నారు. తాజాగా అలాంటి అల్టిమేటం ఇచ్చారు కోదండం మాష్టారు.

ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డినా సీట్ల స‌ర్దుబాటు విష‌యంతో పాటు పొత్తుల లెక్క‌ల‌పై ఇంత‌వ‌ర‌కూ క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌టాన్ని ప్ర‌స్తావించారు. కూట‌మిలో కీల‌క‌మైన కాంగ్రెస్ పై మ‌రింత ఒత్తిడిని పెంచేలా కేవ‌లం 48 గంట‌ల్లో పొత్తుల లెక్క‌లు తేల్చాలంటూ కోదండం మాష్టారి  అల్టిమేటం ఇవ్వ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

మాష్టారి నోటి నుంచి కాంగ్రెస్ కు హెచ్చ‌రిక రావ‌టమంటే..  కేసీఆర్ అంతో ఇంతో స‌క్సెస్ అయిన‌ట్లే చెప్పాలి. కూట‌మి కార‌ణంగా కేసీఆర్ లో కొత్త గుబులు మొద‌లైంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.దీనికి త‌గ్గ‌ట్లే ఆయ‌న బ‌హిరంగ స‌భ‌ల్ని చూస్తే.. వీలైనంత ఎక్కువ‌గా కూట‌మి తూట్లు పొడిచేలా వ్యాఖ్య‌లు కేసీఆర్ నోటి నుంచి రావ‌టం క‌నిపిస్తుంది.

తాము కోరుకున్న స‌టీ్లు ఇవ్వాల‌ని లేనిప‌క్షంలో.. క‌లిసి వ‌చ్చే ప‌క్షాల‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ‌తాన‌ని కోదండం మాష్టారి నోటి నుంచి వ‌చ్చిన మాట ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. అదే జ‌రిగితే.. కూటిమిని విచ్చిన్నం చేయాల‌న్న కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు కోదండం బ‌లం చేకూర్చిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉంటే.. కోదండం మాష్టారి హెచ్చ‌రిక‌ల‌పై కాంగ్రెస్ లో కొత్త క‌ల‌క‌లం చోటు చేసుకుంది. పొత్తుల లెక్క‌లు కొలిక్కి తేవ‌టం అంత తేలికైన విష‌యం కాద‌ని.. కానీ కోదండం మాష్టారి అల్టిమేటం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో స‌రికాద‌న్న మాట ప‌లురురి నోట వినిపిస్తోంది. అల్టిమేటాన్ని వెన‌క్కి తీసుకోవాల‌న్న కాంగ్రెస్ విన‌తిపై మాష్టారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 


Tags:    

Similar News